రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడి అరెస్టు
● పరారీలో మరో నలుగురు నిందితులు
● 216 గ్రాముల బంగారం స్వాధీనం
సికింద్రాబాద్: రైళ్లలో ప్రయాణిస్తూ విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రట్టు చేశారు. గురువారం ముఠా నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్, ఇన్స్పెక్టర్లు బీ.సాయీశ్వర్‌గౌడ్, బీఎస్ సారస్వత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... నార్త్‌వెస్ట్ ఢిల్లీకి చెందిన రణ్‌బీర్‌సింగ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన అతను రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఢిల్లీ రైల్వేస్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసిన అతను అక్కడి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలులో పరిచయమైన మరి కొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన అతను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా చోరీలు చేస్తున్నాడు. ఈనెల 21న ఉదయం తన బృందంతో కలిసి దొంగతనాలు చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 10వ ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్న రణ్‌బీర్‌సింగ్ అనూహ్యంగా పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో ఇక్కడ నాలుగు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. చోరీ సొత్తును కరిగించి బంగారాన్ని ముఠా సభ్యులందరూ సమానంగా పంచుకునేవారమని నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. అతడి నుంచి రూ. 21 లక్షల విలువైన 216 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జట్టు సభ్యులైన హరియాణాకు చెందిన షంషీర్, సుమిత్, సత్వీర్, జగదీశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment