గన్ మిస్ ఫైర్
అమెరికాలో ఉప్పల్ యువకుడి మృతి
● పుట్టిన రోజు నాడే విషాద ఘటన
● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఉప్పల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఉప్పల్ బ్యాంక్ కాలనీకి చెందిన యువకుడు తన హంటింగ్ లైసెన్స్‌డ్ గన్ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి పుట్టిన రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు ఇక తిరిగిరాడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బీబీనగర్ పోచంపల్లి మండలం పెద్దరావుల పల్లి గ్రామానికి చెందిన వ్యాపారి పాల్వాయి సుదర్శన్ రెడ్డి, దీప దంపతులు ఉప్పల్ బ్యాంక్ కాలనిలో నివాసముంటున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు పాల్వాయి అరుణ్ రెడ్డి (24) గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలోని కెనిస్వా యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లాడు.
ఈ నెల 13న తన గదిలోనే స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అరుణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తన హంటింగ్ లైసెన్స్‌డ్ గన్‌ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో తూటా అరుణ్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తన కుమారుడికి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేదని, అందులో భాగంగానే గన్ పేల్చడంలో శిక్షణ కూడా పొందుతున్నాడన్నారు. అమెరికాలో గన్ కొనుగోలు చేసిన విషయం తనకు తెలియదన్నారు. సాధారణంగా తర్ఫీదు పొందిన వారికి హంటింగ్ కోసం గన్ కొనడానికి లైసెన్స్ ఇస్తారని తెలిపారు. అలా లైసెన్స్ ఇవ్వడం వల్లే తన కుమారుడు అసువులు బాశాడని సుదర్శన్ విలపించారు. గురువారం రాత్రి మృతదేహాన్ని అమెరికా నుంచి ఉప్పల్‌లోని స్వగృహానికి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment