ఎట్టకేలకు కదలిక
● రెండున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు
● స్థానిక అభ్యంతరాలతో నిలిచిపోయిన పనులు
● ప్రజాప్రతినిధులతో చర్చించిన అనంతరం పరిష్కారం
● వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాం: జలమండలి ఎండీ
పాతబస్తీ సీవరేజీ నెట్‌వర్క్ పనులు చకచకా
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ సీవరేజీ నెట్‌వర్క్ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. మూసీ నదికి ఉత్తరం వైపున మురుగు నీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ కోసం చేపట్టిన జోన్– 3 సీవర్ నెట్‌వర్క్ ప్రాజెక్టు పనులు రెండున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించి చర్యలకు ఉపక్రమించారు. పాతబస్తీలోని గోషామహల్, నాంపల్లి, కార్వాన్‌తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి మురుగు నీటి పారుదల ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దాదాపు రూ.297 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కొంత మేరకు పనులు సాగిన అనంతరం స్థానిక సమస్యల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
మూడు ప్రాంతాల్లో..
ఓల్ట్‌సిటీ ప్రాజెక్టులో మూడు ప్రాంతాల్లో దాదాపు 2.1 కిలోమీటర్ల మేరకు స్థానిక అభ్యంతరాలు, ఇతరత్రా సమస్యలతో పనులు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రజాప్రతినిధులతో చర్చించి పనులు చేపట్టేలా తాజాగా జలమండలి ఎండీ ఆదేశాలు జారీ చేశారు. మరో 7 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు.
ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు..
పాతబస్తీ పరిధిలోని టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్ (కొంత భాగం), మెహిదీపట్నం. నానల్‌నగర్, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, ఎన్‌ఎండీసీ కాలనీ, మాసబ్‌ట్యాంక్, రెడ్‌హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి మల్లేపల్లి, బేగం బజార్ ప్రాంతాలు. పాతబస్తీలో ప్రస్తుతం సీవరేజీ ఔట్ లెట్ లేని లైన్లను జోన్–3 సీవరేజీ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసేలా జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది.
పాతబస్తీలో సీవరేజీ పనులను పరిశీలిస్తున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
ప్రాజెక్టు స్వరూపం
జోన్–3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి.
జోన్ పరిధిలోకి మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్–1 నుంచి ఎన్–7 వరకు ఎన్–11 ,ఎన్–31 పరీవాహక ప్రాంతాలు వస్తాయి.
ప్రస్తుతం 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజీ నెట్‌వర్క్ కలిగి ఉంది.
మొత్తం కొత్త నెట్‌వర్క్: 129.32 కిలోమీటర్లు
ఆర్‌సీసీ ట్రంక్ సీవర్స్ పైపులైన్ 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ
ఎస్‌డబ్ల్యూజీ నెట్‌వర్క్ 200–300 ఎంఎం డయా: 93.18 కి. మీ
మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి 127.42 ఎంఎల్‌డీ
2051 నాటికి 153.81 ఎంఎల్‌డీ
Comments
Please login to add a commentAdd a comment