జగిత్యాల: జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణం యజమానులకు కత్తిమీద సాములా మారింది. టీఎస్ బీపాస్ నుంచి అనుమతి తీసుకున్నా, అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా.. ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల చేయి తడపనిదే పనులు ముందుకు సాగడంలేదు. భవన యజమానులు అనుమతి తీసుకునేందుకు బల్దియా కార్యాలయాల చుట్టూ తిరగొద్దని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే టీఎస్ బీపాస్ ద్వారా సులభ తరంగా అనుమతి జారీచేయాలని సర్కార్ ఆదేశించింది. అయినా, ఇవేమీ పట్టని కొందరు ప్రజాప్రతినిధులు.. యజమానుల నుంచి అంది నకాడికి దండుకోవడం విస్మయం కలిగిస్తోంది.
టీఎస్ బీపాస్ అభాసుపాలు..
► భవన/ఇంటి నిర్మాణం చేపట్టే యజామనులకు సులభంగా, పారదర్శకంగా అనుమతి మంజూరు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్(టీఎస్– బీపాస్)ను అమలులోకి తీసుకొచ్చింది.
► ఈ విధానంలో దరఖాస్తు చేసుకుంటే.. తొలుత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి.
► అనంతరం మున్సిపల్ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
► నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లో ఇంటి/భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలి.
► ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడే యజమానులు అన్ని ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తులకు జతచేస్తున్నారు.
► అయినా, కొందరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు డాక్యుమెంట్లను కార్యాలయానికి తీసుకొచ్చి చూపించాలని ఆదేశిస్తున్నారు.
► అయితే, ఆమ్యామ్యాలు అందితేనే నిర్మాణాలకు త్వరగా అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మామూళ్లు ఇవ్వకుంటే అడ్డంకులు..
నిబంధనల ప్రకారం అన్నిధువీకరణ పత్రాలు ఉన్నా, టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి తీసుకున్నా.. ఏదోవంక చూపుతూ స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు మామూళ్లు ఇవ్వకుంటే కట్టడాలు కూల్చివేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏవార్డులో ఇంటి/భవన నిర్మాణం చేపట్టారనే సమాచారం తెలుసుకుంటున్న ఆ ఏరియా ప్రజాప్రతినిధి.. వెంటనే యజమానికి వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం పరిపాటిగా మారుతోంది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నిర్మాణం జరగకుండా ఏదోఒక అడ్డండి సృష్టిస్తున్నారని యజమానులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
చేసేది లేక.. చేతులు తడిపి..
గుర్తింపు పొందిన ఇంజినీర్ నుంచి తీసుకున్న ప్లాన్ సహా అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలోనే జతచేస్తున్నారు యజమానులు. పర్యవేక్షించే అధికారులు టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను లాగిన్ చేస్తే ఈ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఇందులో ప్రజాప్రతినిధుల జోక్యం ఏమీ ఉండదు. కానీ, మామూళ్లు ముడితేతప్ప అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్ల యజమానులను వదిలిపెట్ట డంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణ అనుమతులు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతీ మున్సిపాలిటీలో ఇద్దరు ఆర్‌ఐలను నియమించింది. అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలను కూల్చివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ అధికారులే డాక్యుమెంట్లు చూడాల్సిన అవసరం లేదు. కానీ, కొందరు ప్రజాప్రతినిధులు ఎక్కడ భవన నిర్మాణం చేపట్టినా.. అక్కడ వాలుతూ మామూళ్లు ఇవ్వాలని యజమానులను వేధిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో ఓ ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నారు. రంగ ప్రవేశం చేసిన ఓ ప్రజాప్రతినిధి.. తనకు రూ.3లక్షలు లంచం ఇవ్వాలని భవన యజమానిని డిమాండ్ చేసినట్లు తెలిసింది. వాస్తవంగా జీప్లస్–2 అంతస్తుల వరకు నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అనుమతి ఇస్తారు. కానీ జీప్లస్–5 అంతస్తుల నిర్మాణం చేపట్టిన భవన యజమాని.. వరంగల్ రీజినల్ డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నారు. అయినా, సదరు ప్రజాప్రతినిధి లంచం డిమాండ్ చేయడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment