రైస్‌మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీల దడ | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీల దడ

Published Fri, Nov 8 2024 1:47 AM | Last Updated on Fri, Nov 8 2024 1:47 AM

రైస్‌

రైస్‌మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీల దడ

జగిత్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సీజన్‌లో పండించిన వరి ధాన్యం ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. అయితే ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద బియ్యాన్ని సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లర్లకు ధాన్యాన్ని ఇచ్చేది లేదని చెబుతూనే.. ధాన్యం కావాలనుకునే రైస్‌మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని మెలిక పెట్టింది. దీంతో రైస్‌మిల్లర్లు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 190 వరకు రైస్‌మిల్లులు

జిల్లాలో 190 వరకు రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో 110 వరకు రారైస్‌మిల్లులు, 80 వరకు బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. కొన్ని మిల్లులలో సరైన ఆధునిక యంత్రాలు లేవు. కేవలం 50 రారైస్‌మిల్లులు, 70 బాయిల్డ్‌ రైస్‌మిల్లులకే వానాకాలం, యాసంగి సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. రైస్‌మిల్లు సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని అలాట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని అందించాల్సి ఉంటుంది. క్వింటాల్‌ ధాన్యానికి 67కిలోల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాలి. ఆ మేరకు బియ్యం రావడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బియ్యానికి బదులు నూక శాతం ఎక్కువగా వస్తోందని, 62 కిలోలకు తగ్గించాలని మిల్లర్లు కోరుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది మిల్లర్లు సివిల్‌ సప్‌లైకి ఏళ్ల తరబడి బియ్యం ఇవ్వకుండా సతాయిస్తుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ధాన్యం విలువను

బట్టి 10 శాతం బ్యాంకు గ్యారంటీ

ధాన్యం విలువను బట్టి 10శాతం బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాయిల్డ్‌ రైస్‌మిల్లులో 32 ట న్నుల సామర్థ్యానికి 40 వేల క్వింటాళ్ల ధాన్యం, 40 టన్నుల సామర్థ్యానికి 50వేల క్వింటాళ్లు, 50 టన్ను ల సామర్థ్యానికి 60 వేల క్వింటాళ్లు, 60 టన్నుల సా మర్థ్యానికి 70 వేల క్వింటాళ్లు కేటాయించేలా ఏర్పా ట్లు చేశారు. రారైస్‌మిల్లులకూ ఇదే ప్రాతిపదికన కేటాయించాలని నిర్ణయించారు.

రూ.92.80 కోట్ల గ్యారంటీ ఇవ్వాల్సిందే

జిల్లాలో 40లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మద్ధతు ధర రూ.2,320 చొప్పున, రూ.928 కోట్ల మేర కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ మేరకు రైస్‌మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారంటీ ప్రకారం రూ.92.80 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన 60 టన్నుల సామర్థ్యం గల రైస్‌మిల్లు యజమాని రూ.1.62 లక్షల వరకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రైస్‌మిల్లర్లు మాత్రం బ్యాంకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదని.. ఇప్పటికే మిల్లులు నిర్మించేందుకు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నామని, ఇప్పుడు గ్యారంటీ ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇలాగేతే తమకు ధాన్యం కేటాయించొద్దంటూ రారైస్‌మిల్లర్లు ఇప్పటికే కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు

రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది మిల్లర్లు అప్పుల ఊబిలో ఉన్నారు. గతంలో మిల్లర్ల నుంచి తీసుకున్న చెక్కులను సీఎంఆర్‌ పెట్టినప్పటికీ ఇవ్వలేదు. ఏళ్ల తరబడి మిల్లింగ్‌ ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చినవి ఏ మూలకూ సరిపోవడం లేదు.

– మల్లారెడ్డి, రారైస్‌మిల్లర్లు సంఘం

జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ నిబంధనల మేరకే

ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తాం. బ్యాంకు గ్యారంటీ లేదంటే ష్యూరిటీ ఇచ్చిన వారికే ధాన్యం అలాట్‌ చేస్తాం. ఇప్పటికీ సీఎంఆర్‌ రైస్‌ ఇవ్వనివారికి ధాన్యం కేటాయించడంపై ప్రభుత్వానికి నివేదించాం. మిల్లర్లు వారి సమస్యలను విన్నవించారు.

– జితేందర్‌ రెడ్డి,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

ఇవ్వని మిల్లులకు ధాన్యం నో..

ఇవ్వలేమంటున్న రారైస్‌ మిల్లర్లు

జిల్లాలో 190 రైస్‌ మిల్లులు

No comments yet. Be the first to comment!
Add a comment
రైస్‌మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీల దడ1
1/1

రైస్‌మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీల దడ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement