మాటలు కాదు.. సమస్యలపై దృష్టి పెట్టండి
కోరుట్ల: కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన ఆరోపణలు చేయకుండా ప్రజాసమస్యలపై దృష్టి పె ట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రైతు పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, విద్యార్థులు, వివిధవర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, పాదయాత్రకు వచ్చిన స్పందనతో అది తేటతెల్లం అయ్యిందని చెప్పారు. పాదయాత్రలో పాల్గొన్న రైతులు ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడంలేదని తన దృష్టికి తెచ్చారని వివరించారు. నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయంటూ రైతులు విలపించారని తెలి పారు. జిల్లాలో 4.50లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 30వేల టన్నులే కొన్నారని, సన్నధాన్యం మాత్రం కిలో కూడా కొనలేదని చెప్పారు. బోనస్ మాటే లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంతో రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోతున్నారన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు, ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశం, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, నాయకులు కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, సురేందర్, అస్లాం, ఫయీం, అతిక్ పాల్గొన్నారు.
ప్రభుత్వంపై అన్నివర్గాల్లో అసంతృప్తి
మెట్‌పల్లి: ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, రూ.2లక్షలకుపైగా రుణం వారు ఆ మొత్తాన్ని చెల్లించినా సొమ్ము జమ కాలేదని తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేంద్రాల్లో ఆంక్షలతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటూ నష్టపోతున్నారన్నారు. బల్దియా చైర్‌పర్సన్ రాణవేని సుజాత, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి తదితరులున్నారు.
పాదయాత్రకు విశేష స్పందన
రైతు సమస్యలు అనేకం
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
Comments
Please login to add a commentAdd a comment