రైతులకు తేమ తిప్పలు
● కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం ● ఇప్పటివరకు కొన్నది 6.65 లక్షల క్వింటాళ్లే.. ● మబ్బులు పడుతున్న వాతావరణం ● ఆందోళనలో అన్నదాతలు
జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రోజుల తరబడి ఆరబెడుతున్నా.. 17తేమ శాతం రావడం లేదు. దీంతో కొనుగోళ్లు ముమ్మరంగా సాగడం లేదు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం మబ్బులతో నిండి ఉండటంతో ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు పెద్ద సమస్యగా మారింది.
6.65లక్షల క్వింటాళ్లు కొనుగోలు
జిల్లావ్యాప్తంగా వానాకాలం 2.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 60లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 430 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ కేంద్రాల్లో కొనుగోళ్లు సాఫీగా సాగడం లేదు. ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల ద్వారా ఇప్పటివరకు కేవలం 6.65లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యంలో తేమశాతం రాకపోవడంతో నిర్వాహకులు తూకం వేయడం లేదు. దీంతో ఒక్కో రైతు 15 నుంచి 20 రోజులుగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు.
ఆరబెట్టడం పెద్ద సవాల్
ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు పెద్ద సవాల్‌గా మారింది. కేంద్రాల్లో సరిపడా స్థలం లేకపోవడం.. సకాలంలో కూలీలు రాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయినప్పటికీ రైతులు రోజుకు రెండుమూడు సార్లు ధాన్యాన్ని ఆరబెడుతున్నా.. తేమ శాతం రావడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ధాన్యం కుప్పలపై మంచు కురిసి.. మధ్యాహ్నం వరకు కూడా పోవడం లేదు. దీంతో ధాన్యం ఎండడానికి సమయం పడుతోంది. ఓవైపు చలి.. మరోవైపు వాతావరణ మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండడం కూడా ధాన్యంలో తేమశాతం రాకపోవడానికి కారణమవుతోంది. ఫలితంగా రైతులు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఆరబోయడం.. సాయంత్రం ఐదు గంటలకు కుప్పచేయడం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నాలుగైదు రోజులుగా ఆకాశం మబ్బులతో నిండి ఉంటోంది. వాతావరణంలో వస్తున్న అనూహ్యా మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జగిత్యాల మార్కెట్‌లో ఽ10,505 క్వింటాళ్లు కొనుగోలు
జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 10,505 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొక్కజొన్న 393 క్వింటాళ్లు, ధాన్యం దొడ్డురకం 2,165 క్వింటాళ్లు, సన్నరకం 7,947 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
తూకానికి మరిన్ని రోజులు
ధాన్యంలో తేమ శాతం రావడం ఒక ఎత్తైతే.. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయడం మరో ఎత్తుగా మారింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో సాయంత్రం తేమ శాతం వస్తే.. ఉదయం చూసే సరికి తగ్గుతోంది. దీంతో కేంద్రాల నిర్వాహకులు తూకం వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా కేంద్రాలన్నీ ధాన్యంతో నిండిపోతున్నాయి. తూకం వేయడం మరింత సమస్యగా మారే అవకాశం ఉంది. రైతులందరి ధాన్యం తూకం కావాలంటే దాదాపు డిసెంబర్ దాటే అవకాశముందని అన్నదాతలు చెబుతున్నారు. ఇలాగైతే రబీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment