‘సూరమ్మ’ ప్రాజెక్టు పనుల్లో కదలిక
కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లోని 50 వేల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి 520.29 ఎకరాలు భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. కాలువల నిర్మాణానికి 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో భూసేకరణకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్వాసితులకు పరిహారం కోసం రెండు రోజుల క్రితం రూ.10 కోట్లు మంజూరయ్యాయి.
వాల్గొండలో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
మల్లాపూర్: మండలంలోని వాల్గొండలో మంగళవారం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ భక్తులతో పూజలు చేయించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎస్‌కేఎన్‌ఆర్ విద్యార్థి
జగిత్యాల: మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన అండర్–19 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జగన్నాథం అఖిల్ సత్తా చాటి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. అఖిల్‌ను ప్రిన్సిపాల్ దాసరి నాగభూషణం అభినందించారు. కళాశాల నుంచి అఖిల్ ఎంపికవడం అభినందనీయమని, పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో జరిగే జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
పదిలో వందశాతం ఫలితాలు సాధించాలి
సారంగాపూర్: పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. బీర్‌పూర్ మండలం తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. వందశాతం ఉత్తీర్ణతకు అదనపు తరగతులు నిర్వహంచాలన్నారు. సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 వరకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయులు డీఈవోకు తెలిపారు. తుంగూర్‌లో కస్తూరిబా బాలికల గురుకులం విద్యాలయాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేశామని, వారికి సారంగాపూర్ కేజీబీవీలో తరగతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈవో నాగభూషణం, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
కొత్త బల్దియాలకు పోస్టులు మంజూరు
జగిత్యాల: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రాయికల్, ధర్మపురి బల్దియాలకు పూర్తిస్థాయి అధికారులను నియమించారు. బల్దియాలో కీలకమైన శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ వంటి పోస్టులు లేకపోవడం ఇబ్బందికరంగా ఉండేది. తాజాగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన బల్దియాలో పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపాలిటీల్లో పౌరసేవలు ప్రజలకు త్వరితగతిన అందే అవకాశాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment