‘భూభారతి’పైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘భూభారతి’పైనే ఆశలు

Published Tue, Dec 24 2024 12:28 AM | Last Updated on Tue, Dec 24 2024 12:28 AM

‘భూభారతి’పైనే ఆశలు

‘భూభారతి’పైనే ఆశలు

కథలాపూర్‌(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొస్తున్న భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ధరణి వెబ్‌సైట్‌లో పలువురు రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాత సైట్‌ను రద్దు చేసిన ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. సమస్యలు తీరడమే కాకుండా రైతుల భూములకు రక్షణ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయి. సాదాబైనామాకు సంబంధించి గత ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఆ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండగా.. కొత్త చట్టంతో వీటికే కాక ఇతర సమస్యలకూ మోక్షం లభించనుందని అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

35,010 దరఖాస్తులు

వ్యవసాయ భూములు క్రయవిక్రయాలు చేసుకున్న రైతులు నమ్మకంతో తెల్లకాగితంపై నలుగురి సమక్షంలో రాసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత భూముల రేట్లు పెరగడంతో ప్రస్తుత ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని ఇరువురి మధ్య వివాదాలు జరిగిన ఘటనలు కొకొల్లలు. ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములకు పట్టాలు చేయాలని నిర్ణయించింది. 2016లో ఒకసారి సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించి కొందరికి పట్టామార్పిడి, భూమి హక్కులు కల్పించారు. దీనిపై అందరికి అవగాహన లేక దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి 2020 నవంబర్‌లో అవకాశం ఇచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు రైతులు మీసేవా కేంద్రాలకు బారులు తీరారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 35,010 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను రెవెన్యూ అధికారులు పరిశీలించి పట్టాలు ఇస్తారని రైతులు ఆశతో ఎదురుచూడగా, ఏళ్లు గడిచిన మోక్షం లభించకపోవడంతో నిరాశ చెందారు. ఓ దశలో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు కోల్పోతామని ఆందోళన చెందారు.

సాదాబైనామాలకు మోక్షం

గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామా దరఖా స్తుల వివరాలు ఆన్‌లైన్‌ చేసి పట్టాలు జారీ చేయాలని నిర్ణయించారు. కొన్నిరోజుల తర్వాత వాటిని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నట్లు చెబుతుండటంతో దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇవేకాకుండా పీపీబీ డేటా సవరణ, పేరు మార్పిడి, తదితర సమస్యలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవాటికి మోక్షం కలగనుంది.

జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులు 35,010

ఇప్పుడైనా భూ సమస్యలు పరిష్కారమవుతాయనే భావనలో రైతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement