మెట్‌పల్లిలో ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచలన్
మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో పథ సంచలన్ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ పథ సంచలన్ కార్యక్రమానికి స్వయం సేవకులు భారీగా తరలివచ్చారు. మొదట సంఘ ప్రతిజ్ఞ చేశారు. తర్వాత రామాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. పాతబస్టాండ్ మీదుగా పలు వీధుల మీదుగా తిరిగి రామాలయం చేరుకున్నారు. స్వయంసేవకులు గణవేష్ ధరించి, చేతిలో దండతో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. దేశం, ధర్మం కోసం కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. మెట్‌పల్లి పట్టణ,మండల స్వయం సేవకులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్
కథలాపూర్: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వచ్చే నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు. మండల అధ్యక్షుడిగా మారంపెల్లి వినోద్, గౌరవాధ్యక్షుడిగా తెడ్డు శేఖర్, ప్రధాన కార్యదర్శిగా తెడ్డు ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా ఆమెట రాజేశ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కాశవత్తుల లక్ష్మిరాజం, నాయకులు కలిగోట రాజం, శనిగారపు గణేశ్, బాలె నీలకంఠం, బాలు, గంగాధర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఠాణా చేరాలంటే మెట్లు ఎక్కాల్సిందే..
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవాలంటే వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందిగా మారింది. స్టేషన్ గుట్ట పైప్రాంతంలో ఉండడంతో అక్కడకు వెళ్లలేకపోతునానరు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే దాదాపుగా 25కు పైగా మెట్లు ఎక్కి స్టేషన్‌కు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు పైకి వెళ్లకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఇటీవల ఓ వికలాంగుడు నడవలేని స్థితిలో మెట్లు ఎక్కి స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. వికలాంగులు, వృద్ధులు ఫిర్యాదు చేసేందుకు గుట్ట కింద అదనపు కౌంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే బారికేడ్లు తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
చైనా మాంజా ఉపయోగించొద్దు
మెట్‌పల్లి: ప్రమాదకరమైన చైనామాంజాను పతంగులకు ఉపయోగించొద్దని మెట్‌పల్లి డీఎస్పీ రాములు అన్నారు.మెట్‌పల్లి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. చైనా మాంజాతో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. మాంజా అమ్మకాలు చేపట్టవద్దని వ్యాపారులకు సూచించామని తెలిపారు. అలాగే సంక్రాంతి సందర్భంగా ఎక్కడైనా కోడి పందెలు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గతంలో కోడిపందెలు నిర్వహించిన ప్రాంతాలపై ఇప్పటికే నిఘా పెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ నిరంజన్‌రెడ్డి,ఎస్సై కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment