● ఎరువుగా మార్చడంలో అధికారుల నిర్లక్ష్యం ● డంపింగ్ యార
మెట్‌పల్లి: మెట్‌పల్లి 2004లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. రోజురోజుకూ పట్టణం విస్తరిస్తోంది. నూతన గృహాల సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకనుగుణంగా ఇళ్ల నుంచి సేకరించే చెత్త పరిమాణం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ చెత్తతో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశముంది. ఇందులో వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా తయారు చేసి దానిని విక్రయిస్తే భారీగా ఆదాయం సమకూరుతుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో దానికి గండి పడుతోంది. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో వృథాగా వదిలేస్తున్నారు. మరోవైపు పట్టణ శివారులో రూ.లక్షలు వెచ్చించి కంపోస్టు యార్డును నిర్మించారు. దానిని వినియోగించకపోవడంతో నిధులు దుర్వినియోగమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిరోజు 30 టన్నుల చెత్త..
● పట్టణంలో 26వార్డులున్నాయి. ఇందులో 13,442 గృహాలు ఉన్నాయి.
● వీటి నుంచి ప్రతిరోజూ సుమారు 30 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.
● సేకరించే సమయంలోనే ఈ చెత్తను తడి, పొడిగా విభజించాలి. ఇందులో తడి వ్యర్థాలను కంపోస్టు యార్డుకు తరలించి అక్కడ దానిని ఎరువుగా మార్చాలి.
● ఇలా తయారు చేసిన ఎరువును విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.
అధికారుల నిర్లక్ష్యం..
● చెత్తను ఎరువుగా మార్చే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డుకు తరలించి వృథాగా వదిలేస్తున్నారు.
● ప్రస్తుతం కూరగాయల మార్కెట్‌లో సేకరించిన వ్యర్థాలను మాత్రమే సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. రోజుకు 100 కిలోల వరకు తయారు చేస్తున్నారు.
● దీనిని హరితహారం కింద నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు.
● చెత్తను తడి, పొడిగా విభజించి ఇవ్వాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అధికారులు.. దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలో అలసత్వం చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ఈ చిత్రంలో డంపింగ్ చేస్తున్న చెత్త మెట్‌పల్లి పట్టణంలోని ఇళ్ల నుంచి మున్సిపల్ సిబ్బంది సేకరించింది. ఈ చెత్త నుంచి తడి వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి దానిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. చెత్తతో ఆదాయం పొందే అవకాశమున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు సేకరిస్తున్న చెత్తను నేరుగా డంపింగ్ యార్డుకు తరలించి వృథాగా వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment