ఆర్టీఏ సభ్యులుగా కమటాల
జగిత్యాల: రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమటాల శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆయన సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో బాధ్యతగా రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు.
సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు సంక్రాంతి
జగిత్యాలటౌన్: సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు సంక్రాంతి అని జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఆర్డీవో హాజరయ్యారు. రంగవల్లులు, నడక, చదరంగం, క్యారం పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్, ఐసీఐసీఐ డిప్యూటీ మేనేజర్ శ్రావణి, గౌరిశెట్టి విశ్వనాథం, ప్రకాశ్‌రావు, పీసీ హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 30, 31న రాష్ట్ర మహాసభలు
కోరుట్ల రూరల్: ఈనెల 30, 31 తేదీల్లో రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను కోరుట్లలో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట రెడ్డి అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ భవన్‌లో సోమవారం మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్మిక సంఘ జాతీయనేత, దివంగత ప్రభాకర్ స్థాపించిన బీడీ కార్మిక సంఘం పుట్టిన కోరుట్లలోనే మహాసభలు జరగటం కార్మిక వర్గ చైతన్యానికి నిదర్శనమని ఏఐటీయూసీ బీడీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన బీడీ పరిశ్రమలో ఆరు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించేందుకు మహాసభలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి రూ.4వేలకు పెంచుతామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్మికులకు ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 30న భారీ ప్రదర్శన, 31న ప్రతినిధుల మహాసభ ఉంటుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బి.గోవర్దన్, ఎండీ మౌలాన, ముఖ్రం, ఖాసీం, కేవీ.అనసూయ, కొక్కుల శాంత, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment