![ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్‌గా తీసుకోండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10knt53-180142_mr-1739214873-0.jpg.webp?itok=EqDg70DH)
ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్‌గా తీసుకోండి
కరీంనగర్ కార్పొరేషన్: ‘ఎమ్మెల్సీ ఎన్నిక మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో విజయంతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి బాటలు పడతాయి. అలసత్వం వద్దు...సీరియస్‌గా తీసుకోండి. ఆరు నియోజకవర్గాలకో మంత్రి ఇన్‌చార్జిగా ఉంటారు. ఓటింగ్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలదే బాధ్యత’ అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఓ హోటల్‌లో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుందన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 42అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరో పదిహేను రోజులే గడువు ఉన్నందున మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉదృతం చేయాలని సూచించారు. పట్టభద్రుల అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి రోల్ మాడల్ అన్నారు. అన్ని రకాల సర్వే చేసి, తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి,ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎడమ బొజ్జ, మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
నరేందర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నుంచి నేతలంతా తరలిరాగా, కోలాటాలు,ఒగ్గుడోలు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా, తెలంగాణ చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీ తెలంగాణ చౌక్‌కు చేరుకొన్న సమయంలో మంత్రులు ఉత్తమ్, సురేఖలు వచ్చి చేరారు. అంతకుముందు నగరానికి వచ్చిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్, నాయకులు స్వాగతం పలికారు.
ఇంతకీ ఎన్ని వేల ఉద్యోగాలు?
పట్టభద్రుల ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీ అంశం కీలకం కావడంతో, ర్యాలీలో మాట్లాడిన వారంతా తమ ప్రభుత్వం వచ్చాక వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో రకమైన సంఖ్య చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఒకరు 53 వేల ఉద్యోగాలని....మరొకరు 54 వేలని...55 వేలని...56 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని మంత్రులు, నాయకులు చెప్పడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు.
ఈ ఫలితం స్థానిక సంస్థలపై ప్రభావం
ఏడుగురు మంత్రులకు 42 నియోజకవర్గాల బాధ్యతలు
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment