![‘నవోదయ’ను తరలించొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10dmp01-180085_mr-1739214875-0.jpg.webp?itok=KAJCOA50)
‘నవోదయ’ను తరలించొద్దు
ధర్మపురి: ధర్మపురిలోని నేరెళ్లకు మంజూరైన నవోదయ పాఠశాలను తరలించే ప్రయత్నం చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ ఎంపీ అర్వింద్‌కు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. నవోదయ పాఠశాలను ఎంపీ తన పార్లమెంట్ పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఎస్సీ నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి వద్దగల నవోదయకు.. నేరెళ్లకు మంజూరైన నవోదయకు 75 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అయితే 25 కిలోమీటర్ల దూరమే ఉందని కేంద్రానికి నివేదించడమేంటని ప్రశ్నించారు. నేరెళ్లలోని జాతీయ రహదారి పక్కన సర్వేనంబర్ 252లో నవోదయకు కావాల్సిన 30ఎకరాలు సిద్ధం చేశామన్నారు. పనుల ప్రారంభానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ధర్మపురిలో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన బాలుర వసతి గృహంలో తరుగతులు నిర్వహించవచ్చని కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. మార్చి నుంచి తరగుతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ క్రమంలో నవోదయ తరలింపు నిర్ణయం సరికాదని సూచించారు. ఈ విషయమై ఎంపీతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్తానని, అవసరమైతే ప్రధానిని కలిసి వివరిస్తానని తెలిపారు. వెల్గటూర్ వద్ద ట్రామా సెంటర్ ఏర్పాటుకు సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు ఎస్.దినేష్, వేముల రాజేశ్, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, అప్పం తిరుపతి, మధూకర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment