బీమాతో మహిళలకు ధీమా
స్టేషన్‌ఘన్‌పూర్ : మహిళా గ్రామైక్య సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బీమా పథకం మహిళలకు ధీమాగా నిలుస్తోంది. స్వశక్తి సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ ఆర్థికంగా ఎదిగేలా సహకరిస్తోంది. కాగా నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకం మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థికంగా చేయూతను అందిస్తుంది. స్వశక్తి సంఘాల సభ్యులకు భరోసా కల్పించేలా చేపట్టిన బీమా పథకంపై జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్త చేస్తున్నారు.
60ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారికే..
స్వశక్తి సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందించే బీమా పథకం కోసం 60 సంవత్సరాల లోపు వయస్సున్న వారే అర్హులు. సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.10 లక్షలు బాధిత కుటుంబానికి అందిస్తారు. ఒకవేళ సాధారణ మరణం చెందితే రూ.2లక్షలు చెల్లిస్తారు. గతంలో ఒక సంఘంలోని సభ్యుల్లో ఎవరైనా ఒకరు మృతిచెందినా, రుణం చెల్లించకున్నా మిగిలిన సభ్యులు మృతురాలి కుటుంబంపై రుణం చెల్లించాలని ఒత్తిడి చేసేవారు. ప్రస్తుతం ఆర్థిక సాయాన్ని ప్రమాదబీమా పథకం నుంచి చెల్లించే అవకాశం ఉంది. రుణం డబ్బులు బకాయి ఉంటే వాయిదా డబ్బులు పట్టుకుని మిగిలిన డబ్బులు మృతురాలి కుటుంబానికి అందిస్తారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకంపై స్వశక్తి సంఘాల మహిళా సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వశక్తి సంఘాల సభ్యులకు భరోసా
హర్షం వ్యక్తం చేస్తున్న
మహిళా సంఘాల సభ్యులు
జిల్లాలో 11,229 ఎస్‌హెచ్‌జీలు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,229 స్వయం సహాయ సంఘాల్లో 1,27,485 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా 466 గ్రామైక్య సంఘాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వశక్తి సంఘాల సభ్యులకు ఉచితంగా రెండు రకాల బీమా సౌకర్యం కల్పిస్తోంది. ప్రతీ సభ్యురాలికి సాధారణంగా అందించే లోన్ బీమాతో పాటు సురక్ష పథకంలో ప్రమాదబీమా సదుపాయం అందిస్తుంది. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుండగా ఈ ఏడాది మార్చి 14 నుంచి వచ్చే ఏడాది (2025) మార్చి 13 వరకు ఈ పథకం వర్తిస్తుంది. అనంతరం రెన్యువల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది.
మహిళలకు ఎంతో ప్రయోజనం
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకం స్వశక్తి సంఘాల మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. బీమా ద్వారా వచ్చిన డబ్బులతో సభ్యులు బకాయిలు ఉన్న మొత్తం పట్టుకుని మిగిలిన డబ్బును సదరు కుటుంబానికి అందిస్తారు.బీమా పథకం మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తోంది. – వరలక్ష్మి, డీపీఎం
Comments
Please login to add a commentAdd a comment