నీడ మాటున.. నిధులు మాయం | Sakshi
Sakshi News home page

నీడ మాటున.. నిధులు మాయం

Published Tue, Apr 23 2024 8:20 AM

భూపాలపల్లి మండలంలోని గొర్లవీడులో ఏర్పాటు చేసిన షేడ్‌నెట్‌ - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలకు నీడ కల్పించేందుకు వెచ్చిస్తున్న ప్రజాధనం షేడ్‌నెట్‌ల పాలవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ పనికిరాకుండా పోతున్నాయి. తరచూ కొత్త వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో ప్రభుత్వ నర్సరీలు ఏర్పాటుచేసి సుమారుగా 26లక్షల మొక్కులను పెంచుతున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీల్లో 10వేల నుంచి 20వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. వేసవిలోనూ మొక్కల పెంపకం చేపడుతుండటంతో నీడ అవసరం ఉంటుంది. ఇందుకు షేడ్‌నెట్‌ (నీడకోసం పరదా)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి పంచాయతీ నిధులను కేటాయిస్తున్నారు. ప్రతి నర్సరీకి రెండు నుంచి నాలుగు వరకు షేడ్‌నెట్‌ల అవసరం ఉంటుంది. ఒక్కో నెట్‌కు రూ.3వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన రెండు షేడ్‌ నెట్లకు రూ.6వేలు, నాలుగు నెట్‌లకు రూ.12వేలు ఖర్చువుతుంది. ఏటా రూ.15 లక్షల నుంచి 20లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

చిరిగిపోతూ..

కొనుగోలు చేస్తున్న షేడ్‌నెట్లు చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతున్నాయి. ఒక్కసారి చిరిగితే పనికిరాకుండా పోతున్నాయి. గతేడాది కొనుగోలు చేసినవి అప్పుడే పాడైపోయాయి. మొక్కల రక్షణకు మళ్లీ వీటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. ఏటా నిధులు వెచ్చించే బదులు శాశ్వత ప్రాతిపదికన ఒకేసారి నాణ్యమైన నెట్లను గానీ ప్రత్యామ్నాయ పరికరాలను గానీ కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ నర్సరీల నిర్వాహకులు నీడకోసం ఏర్పాటు చేసుకునే విధంగా పంచాయతీల్లో నాణ్యమైనవి ఏర్పాటు చేసుకుంటే ఏటా కొనుగోలు చేసే అవసరం లేకుండా ఖర్చునూ తగ్గించుకోవచ్చంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

రూ.6వేలతో ఏర్పాటు..

మండలంలోని గొర్లవీడు నర్సరీలో ఏటా 10వేల మొక్కలు పెంచుతున్నారు. ఎండ వేడిమికి మొలకలు, మొక్కలు ఎండిపోతుండటంతో ఇటీవల పంచాయతీ నిధులు రూ.6వేలతో షెడ్‌నెట్‌ ఏర్పాటు చేశారు. ఏటా షేడ్‌నెట్‌ ఏర్పాటు చేయడంతో రూ.6వేల వరకు ఖర్చవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ అవి పనికి రాకుండా పోతున్నాయి.

షేడ్‌నెట్‌లకు జిల్లాలో ఏటా రూ.15లక్షలకు పైగా ఖర్చు

నిధులు మంజూరుచేయని డీఆర్‌డీఏ

గ్రామ పంచాయతీ నిధుల నుంచే కొనుగోలు

పంచాయతీలపై అదనపు భారం..

హరితహారం కార్యక్రమం ప్రారంభం నుంచి 2021 సంవత్సరం వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో మొక్కల విత్తనాలు నాటే కార్యక్రమం ప్రారంభం నుంచి మొక్కలు నాటే వరకు ఉపాధి హమీ పథకంలో చేపట్టేవారు. మూడేళ్ల నుంచి కొంత పరిమితికి మాత్రమే విత్తనాలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. నాటుతున్న విత్తనాలు మొలుకెత్తి సంరక్షించే బాధ్యతలను మరిచారు. వేసవితాపంలో మొక్కలకు రక్షణ కల్పించేందుకు షెడ్‌నెట్‌లకు రావాల్సిన నెట్‌లను పంపిణీ చేయడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పంచాయతీ నిధులను వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రతి ఏడాది రూ.10వేల వరకు అదనపు ఖర్చు వస్తుంది.

షేడ్‌నెట్‌ నీడన పెంచుతున్న మొక్కులు
1/1

షేడ్‌నెట్‌ నీడన పెంచుతున్న మొక్కులు

Advertisement
Advertisement