కొలువుదీరిన వెంకన్న
రేగొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారులో ప్రతి ఏటా జరిగే బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న బుగులోని వెంకటేశ్వరస్వామి ప్రత్యేక పల్లకీ సేవలో గుట్టపైకి చేరారు. గుట్ట కింద ఉన్న ఇప్పచెట్టు చుట్టూ తిరిగి గుట్టకు చేరడంతో జాతర ప్రారంభమైంది. అర్చకులు కూర్మచలం వెంకటేశ్వర్లు ఇంట్లో కొలువైన స్వామి వారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్యాణానికి ప్రత్యేక రఽథం
స్వామి వారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహలను డప్పుచప్పుళ్లు, మేళాతాళాలు, కోలాటాల నడుమ జాతర ప్రాంగణానికి తరలించారు. ఊరేగింపుగా వెళ్తున్న స్వామి వారికి అడుగడుగునా మంగళహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి నీరాజనాలు పలికారు. సాయంత్రం గుట్ట కింద ఉన్న శివాలయం ప్రాంగణంలో అలివేలుమంగ, పద్మావతిలతో స్వామి వారి వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని చూడటానికి రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో పాటు పక్క మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం సతీసమేతంగా స్వామి వారిని కొండ గుహలో వెలిసిన ప్రాంతానికి చేర్చారు. స్వామి వారి రాకతో గుట్టపైన ఉన్న గండ దీపాన్ని వెలగించారు. దీంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గుట్టలకు కార్తీక పౌర్ణమి కాంతులు వెలుగుతున్నాయి. పచ్చని ప్రకృతి, పౌర్ణమి కాంతులు, విద్యుత్ వెలుగుల నడుమ బుగులోని కొండలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తున్నాయి.
జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
బుగులోని జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని సీఐ మల్లేష్ అన్నారు. జాతర ఏర్పాట్లపై జాతర ప్రాంగణంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతరకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. జాతరలో వాహనాలను పార్కింగ్ స్థలాలలోనే నిలిపేలా చూడాలన్నారు. సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సందీప్‌కుమార్, ప్రసాద్, శ్రావణ్, అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా బుగులోని జాతర ప్రారంభం
ఘనంగా స్వామి వారి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment