నిబంధనల ప్రకారం కొనుగోళ్లు
గణపురం: ఎఫ్‌ఏ క్యూ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. గణపురం మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ మీటర్ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని విక్రయించే ముందు తాలు, చెత్త, రాళ్లు లేకుండా పరిశుభ్రం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ రైతులకు ముందస్తు సమాచారం అందించాలని చెప్పారు. ట్యాగింగ్ చేసిన మిల్లులకు ధాన్యాన్ని సకాలంలో తరలించేందుకు లారీలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్‌ఓ శ్రీనాధ్, మార్కెటింగ్ అధికారి కనక శేఖర్, డీఎస్పీ సంపత్ రావు, సీఐ మల్లేష్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
గణపురం మండలంలోని ఒద్దులపల్లి, గణపురం, మైలారం గ్రామాలలో పీపీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన అన్ని సదుపాయలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రకియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ధాన్యం అధికంగా రానుందని ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాధ్, మార్కెటింగ్ అధికారి కనుక శేఖర్, డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
సమగ్ర సమాచారాన్ని సేకరించాలి
భూపాలపల్లి: సర్వేలో ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌కాలనీలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ఆదివారం కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సర్వేలో ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి పొరపాటుకు ఆస్కారం లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు సేకరిస్తున్న సమాచారం, నమోదు విధానాన్ని స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్ అభినందించారు. సర్వే వేగాన్ని పెంచడంతో పాటు, తప్పులు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని తెలిపారు. సర్వేలో సేకరించిన డేటా నమోదులో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాచార సేకరణ ఫారాలను పకడ్బందీగా భద్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సర్వే నోడల్ అధికారి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment