వన్యప్రాణుల వేట
కాళేశ్వరం: జిల్లాలో రోజుకో చోట అడవుల్లో వన్యప్రాణుల వేట జరుగుతోంది. సంబంధిత అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతోంది. భూపాలపల్లి, మహదేవపూర్, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, మహాముత్తారం, మల్హర్ అటవీప్రాంతాల్లో ఎక్కువగా వేట జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేటాడిన మాంసాన్ని పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఉచ్చులు తగ్గేదెలా..
అటవీప్రాంతాల్లో వేట షరామామూలు అయింది. నిత్యం అటవీగ్రామాల్లో వేట కోసం విద్యుత్ తీగలకు ఉచ్చులు తయారుచేసి వేస్తున్నారు. దానికి మూగజీవాలతో పాటు జిల్లాలో రైతులు మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో కాటారం–మహదేవపూర్ అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న యువ పోలీసు కానిస్టేబుల్ విద్యుత్ ఉచ్చుకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని రోజులు తగ్గుముఖం పట్టిన వేట మళ్లీ షురూ అయింది.
అధికారులు అవగాహనతో..
గతేడాది పెద్దఎత్తున అటవీ, పోలీసు, విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అప్పటినుంచి కాస్త స్తబ్దుగా ఉన్న పల్లెల్లో మళ్లీ ఏదో ఒక చోట వేట జరుగుతుంది. వేటగాళ్లు దొరికి జైలు పాలవుతున్నా మారడం లేదు.
ఇతర ప్రాంతాల నుంచి..
గతంలో ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుప్పుల వేట మాదిరిగానే ప్రస్తుతం పట్టణాలనుంచి కూడా వేటాడేందుకు కొంతమంది వేటగాళ్లు అడవి బాట పడుతున్నారని తెలిసింది. వారంలో ఒకరోజు అడవులు ఉన్న ప్రాంతానికి చేరుకొని వేటాడుతున్నారని వినికిడి. ఇప్పటివరకు అటవీశాఖ అదికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఉచ్చులు బిగించే బ్యాచ్‌లు సైతం మళ్లీ వేటకు రెడీ అవుతున్నారని తెలిసింది.
తగ్గిన నిఘా..
ఎన్ని కౌన్సెలింగ్‌లు చేసినా వేటగాళ్ల తీరు మారడం లేదు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ ప్రత్యేక నిఘా విభాగాలు రాత్రి వేళల్లో గస్తీలు నిర్వహించడం లేదు. పెట్రోలింగ్ టీంలు, ప్లయింగ్‌స్క్వాగ్ విభాగాల తనిఖీలు, సోదాలు తగ్గాయని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వణ్యప్రాణులకు రక్షణ కల్పించాల్సి అవసరం ఉంది.
అడవుల్లో ఉచ్చులు పెడుతున్న వేటగాళ్లు
అటవీ మాంసానికి డిమాండ్
పట్టణాలకు తీసుకువెళ్తూ
సొమ్ముచేసుకుంటున్న వైనం
తగ్గిన అటవీశాఖ నిఘా
పట్టణాలకు మాంసం..
అడవుల్లో వేటాడిన దుప్పులు, కుందేలు, అడవి పందులు, ఏదు, కొండగొర్లు, అడవి పక్షులను ఉచ్చులు, కత్తులతో హతమార్చి మాంసాన్ని పట్టణాలకు, తమ బంధువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో అటవీ మాంసం విలువ కిలోకు రూ.600లకు పైనే పలుకుతుంది. దీంతో కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు ఇష్టపడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు నిత్యం ఆర్టీసీతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాల్లో మాంసాన్ని తరలిస్తున్నట్లు సమాచారం.
అవగాహన కల్పిస్తున్నాం..
క్యాచ్ ద ట్రాప్స్ అనే కార్యక్రమం ద్వారా అనుమాసం ఉన్న ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ చేపడుతున్నాం. ఉచ్చులు బిగించకుండా అటవీమార్గంలో విద్యుత్ లైన్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వేటగాళ్లను నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. – రవి, అటవీశాఖ రేంజర్, మహదేవపూర్
Comments
Please login to add a commentAdd a comment