మీతోపాటే నేనూ..
మల్హర్: విద్యార్థులతో పాటే నేనూ అంటూ.. కలెక్టర్ నేలపై కూర్చుని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండలంలోని మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ‘ఆరు బయటే వంట’ అనే శీర్షికతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పరిస్థితిపై గురువారం సాక్షి ప్రచురించిన కథనానికి కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఈ సందర్భంగా పాఠశాలలోని బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. నాణ్యత లోపించిన వస్తువులను వాడరాదని సంబంధిత ఎస్‌ఓ (స్పెషల్ ఆఫీసర్)ను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముఖాముఖి చర్చ నిర్వహించి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం, భోజనం బాగుంటుందా, సరిపోను పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తంచేశారు. భోజనం రుచిగా ఉందని ఎస్‌ఓను, వంట సిబ్బందిని కలెక్టర్ ప్రశంసించారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఆహార నాణ్యతను పాటించాలని సూచించారు. చలికాలంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోలార్ విద్యుత్‌కు మరమ్మతులు చేపించాల్సి ఉందని ఎస్‌ఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీఓలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని ఆదేశించారు.
జాప్యంలేకుండా కొనుగోలు చేయాలి
17 శాతం తేమ ఉంటే జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సెంటర్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని తాడిచర్ల, పెద్దతూండ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. తేమ శాతాన్ని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత గల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా ట్యాగ్ చేసిన మిల్లులకు వెంటనే రవాణా చేయాలని అధికారులను ఆదేశించా రు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందుల కు గురిచేయొద్దని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని తనిఖీ చేశా రు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వే సమగ్ర సమాచారం పూర్తి గా గోప్యతగా ఉంచాలని, బయటికి వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రంథాలయ భవనం, సహకార సంఘ భవనాలను పరిశీలించి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యాం సుందర్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండెయ్య, వైస్ చైర్మన్ మల్క ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీపీ మల్హల్‌రావు, సీఈఓ సంతోష్ పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి
భోజనం చేసిన కలెక్టర్
ప్రతీ శుక్రవారం
మధ్యాహ్న భోజనం తనిఖీ
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment