మల్లంపల్లి మండల గెజిట్ విడుదల
ములుగు రూరల్: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ను ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం విడుదల చేశారు. దీంతో పది మండలాలతో ములుగు జిల్లా స్వరూపం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి మంత్రి సీతక్క పలుమార్లు తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన పరిపాలనా సౌలభ్యం కోసం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ములుగు మండల పరిధిలో ఉన్న పంచాయతీలు మల్లంపల్లి, మహ్మద్‌గౌస్‌పల్లి, పందికుంట, శివతండా, రాంచంద్రాపురం, కొడిశలకుంట, దేవనగర్, శ్రీనగర్, గుర్తూర్‌తండా, ముద్దునూరు తండాలకు కలుపుకొని నూతనంగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పది పంచాయతీలతో మ ల్లంపల్లి, రాంచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాల పరి ధిని మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది.
మండల ఏర్పాటుకు
అలుపెరగని ఉద్యమాలు
నూతన మండలం కోసం మల్లంపల్లి గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని మండల సాధన సమితి పేరుతో అలుపెరుగని ఉద్యమాలు చేసి మండలం సాధించుకున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మరణం అనంతరం మల్లంపల్లి ప్రజలు జేడి మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఎట్టకేలకు మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కోండ రాజు, సాధన సమితి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామస్తుల చిరకాల వాంచ నేరవేరడంతో ప్రజలు సంబురాల్లో మునిగితేలారు.
మల్లంపల్లి ప్రాంత వాసులకు శుభాకాంక్షలు
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేశాం.. ఈ ప్రాంత వాసులకు శుభాకాంక్షలు. ఇచ్చిన మాటను సీతక్క మరిచిపోదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. కొంత మంది ఓట్ల కోసమే హామీలు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. వారందరికీ మల్లంపల్లి మండల ఏర్పాటు గెజిట్ చెంపదెబ్బగా మారింది. అడిగిన వెంటనే స్పందించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యేలా కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు రుణపడి ఉంటారు.
– ధనసరి సీతక్క, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి
సీఎం రేవంత్‌రెడ్డి,
మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు
ప్రజల ఆకాంక్షల మేరకు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు కృతజ్ఞతలు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని ఒప్పించి మండలంగా ఏర్పాటు చేసేందుకు చాలా కష్టపడ్డారు. చివరిగా ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది.
– పైడాకులు అశోక్, డీసీసీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment