కేసుల విచారణలో జాప్యంచేస్తే చర్యలు
భూపాలపల్లి: కేసుల విచారణలో జాప్యంచేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని, పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణను త్వరగా పూర్తిచేసి చార్జీషీట్‌లు దాఖలు చేయాలన్నారు. ప్రతీ కేసుకు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. లక్ష్యం నిర్దేశించుకుని విధులు నిర్వర్తించాలని చెప్పారు. దొంగతనాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీ కేసుల్లో అన్ని కోణాల్లో విచారణ చేసి దుండగులను గుర్తించి సొత్తును రాబట్టాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు(బ్లాక్ స్పాట్స్)ను గుర్తించి, ప్రమాదాల నివారణకోసం సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, రామ్మోహన్‌రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
శాసీ్త్రయ విజ్ఞానంతోనే సమాజ అభివృద్ధి
భూపాలపల్లి అర్బన్: శాసీ్త్రయ విజ్ఞానంతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఎస్పీ కిరణ్‌ఖరే తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ మాంటిస్సోరి హైస్కూల్‌లో నిర్వహించగా ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానవ పరిణామ క్రమం గురించి విద్యార్థులను ప్రశ్నించారు. జీవితంలో ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని కలిగి ఉండాలన్నారు. సైన్స్ మన అభివృద్ధి కోసం వాడుకోవాలని, చెడు పనులకు వినియోగించరాదన్నారు. విద్యార్థులందరూ తమ కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. అత్యవసర సమయాలలో పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని షీ టీమ్స్, 100 సర్వీస్‌లను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పొగాకుల రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు, నాయకులు రాజు, సాంబయ్య, బొట్ల కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, లక్ష్మిప్రసన్న, సాంబమూర్తి, నాగరాజు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment