రాజీమార్గమే రాజమార్గం
భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్‌లో కేసులను అధిక సంఖ్యలో పరిష్కారం చేయడానికి కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు పోలీసు అధికారులకు సూచించారు. కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రజలలో ద్వేష భావాలను తగ్గించి కేసుల్లో రాజీమార్గాన్ని అలవాటు చేయాలన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని ప్రజల్లో నింపాలన్నారు. దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని చెప్పారు. చిన్న, చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పోలీస్‌స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రారావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అదనపు ఎస్పీ బోనాల కిషన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
గణపురం: కేటీకే ఓసీ–3 ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందించి ఆదుకుంటామని భూపాలపల్లి ఆర్డీఓ మంగీలాల్ అన్నారు. ధర్మరావుపేట శివారులో గల షాలకుంట శివారులోని భూములను ఆర్డీఓ పరిశీలించారు. ఓసీ–3 ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేస్తున్న ధర్మరావుపేట శివారులో గల షాలకుంట శివారు 38.5గుంటల విస్తీర్ణం, కొండంపల్లి గ్రామం వద్ద26.22 గుంటల విస్త్తీర్ణం గల భూములను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి సింగరేణి సంస్థ సేకరిస్తున్న భూముల హద్ధులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. భూములలో ఉన్న పామ్ ఆయిల్ మొక్కలు, బోర్లు, బావులు, చెట్లు, డ్రిప్ ఇరిగేషన్‌ను పరిశీలించారు. వీలైనంత త్వరగా రైతులకు నష్ట పరిహారం అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రెవెన్యూ, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
అనుచిత వ్యాఖ్యలు సరికాదు
భూపాలపల్లి రూరల్: వెలమ కులాన్ని దూషిస్తూ షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెలుమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ మనోహర్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్ వెలుమలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వెలుమలకు ఎమ్మెల్యే శంకర్ భేషరతుగా క్షమాపన చెప్పాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల, గ్రామాల నుంచి వెలుమ సంఘం నాయకులు, వెలుమలు పాల్గొన్నారు.
ఘనంగా సుబ్రహ్మణ్య
షష్టి పూజలు
కాళేశ్వరం: షష్టి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. శనివారం ఆలయంలో ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఆధ్వర్యంలో అభిషేకం చేసి పూజలు చేశారు. పూజాకార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మారుతి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment