విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 7వ రోజు జిల్లాకేంద్రంలోని శాంతినికేతన్(బిట్స్) పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, డీఈఓ రాజేందర్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు పట్టుదలతో, ఇష్టంగా చదవాలని, ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. రానున్న వారం రోజుల్లో దాదాపు 10వేల మంది వసతి గృహ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ, వేడినీళ్ల సౌకర్యం అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. జిల్లాను శాసీ్త్రయ మార్గంలో నడిపిస్తున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి ప్రయోగాలు చేసే దిశగా సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన ఇన్నోవేషన్ అంశాలు ప్రజలకు ఉపయోగపడేలా వినియోగిస్తామని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శన ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment