సన్నాలకే సై
భూపాలపల్లి రూరల్: జిల్లాలో సాధారణంగా యాసంగిలో రైతులు దొడ్డురకం ధాన్యం సాగుచేస్తారు. కానీ ఈ ఏడాది సన్న రకం ధాన్యం సాగుకే సై అంటున్నారు. వానాకాలం సాగుచేసిన సన్నాలకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చింది. సన్నాలకు బోనస్ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో యాసంగిలోనూ సన్నాల సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రైవేట్ కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసి నార్లు పోసుకుంటున్నారు.
జిల్లాలో 92,500 ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఈ యాసంగిలో 92,500 ఎకరాల వరకు వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 20 వేల ఎకరాల్లో దొడ్డు రకం ధాన్యం, మరో 18,500 వేల ఎకరాల్లో ఆడ మగ రకం సాగు కానుంది. మిగిలిన 54 వేల ఎకరాలకు పైగా సన్నాలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. సాగు నీ టి వనరులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బోనస్ రూ.90 లక్షలు
జిల్లాలో వానాకాలంలో 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి రూ.35 కోట్లు మద్దతు ధర చెల్లించగా, బోనస్ కింద మరో రూ.90 లక్షలకు పైగా రైతులకు చెల్లించారు.
విదేశాల్లోనూ డిమాండ్..
దొడ్డురకం ధాన్యం సాగు చేసి మిల్లర్లను బతిమిలాడే బదులు భోజనానికి ఉపయోగించే సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తే కొంతమేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. సన్నరకానికి ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్ ఉండడంతో ఎగుమతి చేసే అవకాశం ఉంది. మద్దతు ధర దక్కకపోతే బియ్యంగా మార్చి విక్రయిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతలు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు.
పక్క ఫొటోలోని రైతు భూపాలపల్లి మండలం కొత్తపల్లి (ఎస్‌ఎం)కి చెందిన ముత్యాల శ్రీను. ప్రతీ సంవత్సరం దొడ్డు వడ్లను సాగు చేసే శ్రీను ఈ సంవత్సరం ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో తనకున్న నాలుగెకరాల్లో ఖరీఫ్‌లో సన్న రకం ధాన్యం సాగు చేశారు. దీంతో సుమారు రూ.18వేలు లబ్ధిపొందారు. ఈ యాసంగిలో కూడా సన్న రకం ధాన్యం సాగు చేసేందుకు నారు పోశారు. జిల్లాలో చాలా మంది అన్నదాతలు సన్నాల సాగుకే సై అంటున్నారు.
యాసంగిలో సన్నరకం ధాన్యం సాగుకు రైతుల మొగ్గు
ఇప్పటికే నార్లు పోస్తున్న అన్నదాతలు
92,500 ఎకరాల్లో సాగు అంచనా..
సాగు పెరుగుతోంది..
ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో 70 శాతం రైతులు సన్న రకం ధాన్యం సాగుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నార్లు పోసుకున్నారు. నారు పోసుకొని రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా పంట వేసుకోవాలి. గతేడాది 30 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేశారు. రైతులు వరికొయ్యలను కాల్చొద్దు.
– విజయ్‌భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment