● ఏఓ వాసుదేవరెడ్డి
రేగొండ: యాసంగి వరి సాగులో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. సోమవారం రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు మొదటగా నారు మడిని బాగా దున్ని మూడు సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలన్నారు. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు మడిలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పోటాశ్‌తో పాటు పశువుల పేడ వేయాలన్నారు. జింకు లోపం సవరణకు లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. వరి నారు నాటు వేయాడానికి సిద్ధంగా వచ్చిన సమయానికి వారం ముందు గుంట నారుమడికి 400 గ్రాముల కార్భోప్యూరాన్ 3జీ గుళికలను ఇసుకలో కలిపి చల్లాలలన్నారు. నాటు వేయాడానికి 15 రోజుల ముందు దమ్ము చేయాలన్నారు. జీవన ఎరువులు అనగా అజోలా 150 కిలోలు, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ పొలంలో వేసి మూడు వారాల పాటు పెరగనిచ్చి నేలలో వేసి కలియదున్నాలని తెలిపారు. నాటు వేసిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు ఒకటి చొప్పున కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాగులో సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment