జోరుగా కోళ్ల పందేలకు ఏర్పాట్లు
ఆ మూడు మండలాల్లో..
బోగి, సంక్రాంతి పండుగ రోజుల్లో పందెం కోళ్లతో పోటీలు నిర్వహించనున్నారు. ప్రతీఏటా ఈ పోటీలు, బెట్టింగ్‌లు కాటారం డివిజన్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో పోటీలు నిర్వహించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఈ నెల మొదటివారం నుంచే జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తుతం, సంక్రాంతి పండుగ రోజుల్లో రూ.2వేల నుంచి రూ.10వేల వరకు మాత్రమే బెట్టింగ్ జరుగుతోంది. దీంతో రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్‌లో పాల్గొనే కొందరు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. భారీ మొత్తంలో బెట్టింగ్ వేసేవారు ఏపీలో మేలు రకమైన పందెం కోళ్లతో వెళ్లనున్నారు.
భూపాలపల్లి: సంక్రాంతి పండుగకు కోడి పందేలు జోరుగా సాగనున్నాయి. పోటీల కోసం కొందరు ఇక్కడే కోళ్ల పెంపకం చేపట్టగా, మరికొందరు ఏపీలో కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. జిల్లాలోని అడవులు, పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో సాగనున్న పోటీలకు వెళ్లేందుకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా పందేలు కొనసాగుతుండగా, సంక్రాంతికి మాత్రం భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో కొనుగోళ్లు..
జిల్లాలోని మహాముత్తారం, పలిమెల, మల్హర్, కాటారం, భూపాలపల్లి మండలాల్లో కొందరు పందెం కోళ్లను పెంచుతున్నారు. జాతికోళ్లు, క్రాస్‌బ్రీడ్ రకం మాత్రమే ఇక్కడ లభిస్తున్నాయి. ఇవి పందేంలో గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉండటంతో మరికొందరు మేలు రకాల కోళ్ల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నారు. ఏపీలోని భీమవరం, గుంటూరు, రేణిగుంట, సంగారెడ్డి, పెబ్బర్ తదితర ప్రాంతాల్లో మేలు రకాలైన కోళ్లు పెంచుతారు. అక్కడి వాటిని జిల్లావాసులు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. పోటీల్లో పాల్గొనే పందెం కోళ్లకు ప్రోటీన్‌తో కూడిన ఆహారం అందించి పెంచుతారు. దీంతో వాటికి ధరలు భారీగా ఉంటాయి. కోళ్ల రకం ఆధారంగా రూ.3వేల నుంచి రూ.3లక్షల వరకు ధర ఉంటుంది. జాతికోళ్లు, క్రాస్‌బ్రీడ్, ఇరానీకాకి, సీలం, మెటవటం, రెటవటం, పెరోవియన్, పెరో రకం కోళ్లతో ఎక్కువగా పోటీలు నిర్వహిస్తుంటారు.
ధర ఎంతంటే..
క్రాస్‌బ్రీడ్ రకానికి కోళ్లకు రూ.4వేల నుంచి రూ. 6వేలు, జాతికోళ్లకు రూ.4వేల నుంచి రూ.12వేలు, ఇరానీకాకి రూ.6వేల నుంచి రూ.15 వేలు, మెటవటం రూ.20వేల నుంచి రూ.లక్ష, పెరోవియన్ రకానికి రూ.50వేల నుంచి లక్ష వరకు ఉంటుంది. పోటీల్లో ఎక్కువగా గెలుపొందే పెరో రకం కోడికి ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు ఉంది.
చర్యలు తప్పవు..
కోళ్ల పందేలు ఆడటం చట్టరీత్యా నేరం. సంక్రాంతి పండుగ రోజుల్లో గాలింపు ముమ్మరం చేపిస్తాం. బెట్టింగ్‌లు నిర్వహిస్తే పట్టుకొని గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. కోడి పందేలు ఆడిడబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందుల కు గురి కావొద్దు. కోళ్ల పందేలు ఆడటంతో పాటు చూసేందుకు కూడా వెళ్లి కేసుల పాలు కావొద్దు.
– సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి
ఇప్పటికే జిల్లా అడవుల్లో
రహస్యంగా నిర్వహణ
ఏపీలో ప్రత్యేక కోళ్లను
కొనుగోలు చేసిన పందెంరాయుళ్లు
ఒక్కో కోడి ధర రూ.3వేల నుంచి
రూ.3లక్షల వరకు
Comments
Please login to add a commentAdd a comment