ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
నర్సంపేట రూరల్: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన తోట శివరాజ్ కుమార్ అలియాస్ జెట్లి (20), కరీంనగర్‌కు చెందిన అభిరామ్, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన శేషు నర్సంపేట మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. లక్నెపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నారు. రాత్రి సమయంలో లక్నెపల్లి నుంచి హాస్టల్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. లక్నెపల్లి బస్టాండ్ సమీపంలోకి రాగానే వరంగల్ నుంచి నర్సంపేట వైపు వస్తున్న కారు వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ఎగిరిపడ్డారు. దీంతో తోట శివరాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శేషు, అభిరామ్‌ను స్థానికులు 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. శివరాజ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నర్సంపేట ఎస్సై గూడ అరుణ్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై ఎస్సైని వివరణ కోరగా ముగ్గురు నర్సంపేట మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అందులో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు అందగానే కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామన్నారు.
బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
వరంగల్ జిల్లా లక్నెపల్లి గ్రామంలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment