గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు
భూపాలపల్లి: గొలుసు కట్టు వ్యాపారాల జోలికి వెళ్లి మోసపోవద్దని ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసంచేసే మల్టీలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయని, వివిధ వస్తువులు, గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ మొదలగు వాటి పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఎక్కువ మంది ఏజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మవద్దన్నారు. చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతాయన్నారు. సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. చాలామంది విదేశాల్లో ఉండి మల్టీలెవెల్ మార్కెటింగ్‌ను ఒక రాకెట్‌లా నడుపుతారని, భారీ లాభాలతోపాటు లగ్జరీ కార్లు, ఫారెన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వల పన్నుతారని తెలిపారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకే ఫైల్స్ లాంటివి డౌన్‌లోడ్ చేయవద్దని, మోసపూరిత ప్రకటనలు, ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 గానీ జిల్లా సైబర్ సెల్ వాట్సాప్ నంబర్ +918712658154 కు గాని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment