సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులకు తావివ్వొద్దు
మానవపాడు: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు తెలిపిన వివరాలు పొందుపర్చాలని, ఎట్టి పరిస్థితిలో తప్పులకు తావివ్వొద్దని ప్రత్యేక ఐఏఎస్ అధికారి రవిచందర్, డిఎస్‌ఓ నాగర్జునగౌడు సూచించారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో సమగ్ర కుటుంబ సర్వేను వారు తనిఖీ చేశారు. గ్రామాల్లో సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని, తాళం వేసిన ఇంటికి మరుసటి రోజు వెళ్లాలని, లేదా సమీప ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. అర్థమయ్యేలా ప్రశ్నలు వివరించి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ భాస్కర్, తహసీల్ధార్ వాహిదా ఖాతూన్, ఆర్‌ఐ గరురాజ్ పాల్గొన్నారు.
అలరించిన
పౌరాణిక నాటకాలు
గద్వాలటౌన్: అలనాటి పౌరాణిక నాటక కళావైభవం మరోసారి గద్వాల బాలభవన్‌పై వెళ్లివిరిసింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా రంగస్థల కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అందరి దృష్టిని తమవైపు మల్చుకున్నారు. పౌరాణిక నాటకాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్థానిక బాలభవన్‌లో కళాకారులు పౌరాణిక నాటక ప్రదర్శన ఇచ్చారు. పడక సీను, చింతామణి భవాని, శ్రీరామంజనేయ యుద్ధం సన్నివేశాలను తమ అభినయంతో నాటకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉపశమనం పొందేందుకు సాంప్రదాయ కళలు, నాటకాలు పరిపూర్ణంగా దోహద పడతాయని పలువురు పేర్కొన్నారు. సమాజాన్ని చైతన్య పర్చేలా పౌరాణిక నాటక ప్రదర్శనలను రూపొందించాలని సూచించారు.
వరికొయ్యలను కాల్చొద్దు
నాగర్‌కర్నూల్ రూరల్: రైతులు వరికోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా కుళ్లింపజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికొయ్యలను కుళ్లించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరికొయ్యల అవశేషాలపై ఎకరాకు 50 సూపర్ సల్ఫేట్, 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలని సూచించారు. నీటి తడి ద్వారా డీకంపోజింగ్ చేసుకోవచ్చని.. లేదా రోటవేటర్‌తో దమ్ము చేసుకోవాలని తెలిపారు. భూమిలో పోషకాలను కాపాడుకోవడం కోసం రైతులు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనాన్ని తగ్గించడంతో భూసారం పెంచుకోవడంతో పాటు వా యు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
ధాన్యంతో కిక్కిరిసిన బాదేపల్లి యార్డు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు పంట దిగుబడులతో కిక్కిరిసింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 9,326 క్వింటాళ్ల ధాన్యం యార్డుకు విక్రయానికి వచ్చింది. ఇంత ధాన్యం యార్డుకు రావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారిగా అధికారులు తెలిపారు. అదేవిధంగా 2081 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలు గరిష్టంగా రూ.2,417, కనిష్టంగా రూ.1,912 ధరలు లభించగా ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.1,550, హంస రకం రూ.2,011, రాగులు రూ.2,222, వేరుశనగ గరిష్టంగా రూ.6,213, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి.
ఎన్టీఆర్‌లో స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన పీజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో బుధవారంలోగా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం సెల్ నం.96404 14429ను సంప్రదించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment