వృత్తి విద్య కళాశాల మంజూరు చేయాలి
అలంపూర రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాలకు 15 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు మంజూరు చేసిందని, అలాగే అలంపూర్ నియోజకవర్గానికి కూడా వృత్తి విద్య కళాశాల మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అలంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న అలంపూర్‌కు వృత్తి విద్య కళాశాల మంజూరు చేయడం ద్వారా ఇక్కడి యువత, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఈ విషయాన్ని ఇక్కడి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికార పార్టీ నాయకులు సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడంలేదని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు వారి పిల్లల విద్య అవసరం లేదా ఇక్కడి ప్రజలను కేవలం ఓట్ల కొరకే ఉపయోగించుకుంటున్నారా విద్యా సంస్థల ఏర్పాటుపై ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా లేవా అని అన్నారు. ఆయా మండలాల్లో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలు ఏర్పాటుచేసే విధంగా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజశేఖర శర్మ, ఈశ్వర్, నాగేశ్వర్ రెడ్డి, నాగ మల్లయ్య, జగన్మోహన్ రెడ్డి, వినీత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment