చేనేత వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
రాజోళి: చేనేత కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. డిసెంబర్ 10వ తేదీన చేనేత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో చేనేత కార్మికుల జీవితాలపై, జీవన విధానంపై వారు అధ్యయన యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులతో కలిసి రాజోళిలో చేనేత కార్మికుల ఇళ్లలో మగ్గాలను పరిశీలించారు. వారు నేస్తున్న చీరలు, వారికి అందుతున్న పథకాలను గురుంచి అడిగి తెలుసుకున్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక హ్యాండ్‌లూమ్స్ టెక్స్‌టైల్స్ బోర్డు, హ్యాండీ క్రాఫ్ట్, మహాత్మాగాంధీ బూనకర్ యోజన పథకాన్ని రద్దు చేశారని అన్నారు. గత ప్రభుత్వాలు చేనేత వస్త్ర పరిశ్రమపై జీఎస్‌టీలు విధించలేదని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎస్‌టీతో చావు దెబ్బ తీశారన్నారు. 2013–14 లో యుపీఏ ప్రభుత్వం రూ.2వేల కోట్లు నిధులు చేనేత కార్మికులకు కేటాయించగా.. మోదీ ప్రభుత్వం నేటి వరకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. చేనేత సంక్షేమ బోర్డుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మూషం నరహరి, నాయకులు వర్కాల చంద్రశేఖర్, రాజోళి చేనేత సహకార సంఘం ఇంచార్జ్ దోత్రే శ్రీనువాసులు, బాబు, వంకా మహేష్, సోమశేఖర్, గోపాల్, గోవిందు, రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment