వేరుశనగ క్వింటా రూ.6,979
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు బుధవారం 313 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6979, కనిష్టం రూ.3569, సరాసరి రూ.5289 ధరలు పలికాయి. అలాగే, 30 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5659, కనిష్టం రూ.5419, సరాసరి రూ.5655 ధరలు లభించాయి. 1741 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2710, కనిష్టం రూ.1902, సరాసరి ధరలు రూ.2624 పలికాయి.
విద్యార్థులను
ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మల్దకల్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డాక్టర్ ప్రియాంక ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండలంలోని పాల్వాయి, అమరవాయి హైస్కూళ్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థులు శ్రద్ధతో చదువుకుని మంచి ఉత్తీర్ణతను సాధించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతి రోజుమెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జీ ఎంఈఓ సురేష్, ప్రధానోపాధ్యాయులు నరేష్, నరసింహచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
గద్వాలటౌన్: సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఆప్పటి వరకు మినిమమ్ టైమ్ స్కేల్ కల్పించాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లాలోని అన్ని కేజీబీవీల ఎదుట సమగ్ర శిక్ష పరిధిలోని సీఆర్‌పీలు, సీఆర్‌టీలు, నాన్ టీచింగ్ స్టాప్, ఇతర సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా కేజీబీవీల వద్ద పలువురు మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.20 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు కల్పించాలన్నారు. పదవీ విరమణ పొందిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ కల్పించాలన్నారు. తమ సమస్యలపై వివిధ దశల్లో నిరసనలు తెలుపుతామని, సమస్య పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసనకు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment