గలీజు దందా..!
సూత్రధారులు ఎవరు..?
ధనార్జన.. యువతే లక్ష్యంగా కొందరు ముఠాగా ఏర్పడి వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. వివిధ స్థాయిలో ధర నిర్ణయించి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తూ దందా నడుపుతున్నారు. అయితే, దందాలో వివిధ స్థాయిలో పరిచయాలు, ప్రముఖులు ఉండడం కేసు విచారణకు తలనొప్పిగా ఉందనే అరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యభిచార ముఠా సభ్యులకు ఎవరైతే ఇళ్లను అద్దెకు ఇస్తున్నారో వారు తెలిసే ఇళ్లను అద్దెకు ఇస్తున్నారా అనే విషయంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అందమైన అమ్మాయిల ఫొటోలను వాట్సాప్ గ్రూప్‌లలో విటులు, బ్రోకర్లకు పంపి డిమాండ్ మేరకు వారి నుంచి డబ్బులు దండుకోవడం వ్యభిచార ముఠా సభ్యులకు వెన్నతో ముట్టిన విద్యగా మారింది. జిల్లాలోని యువత సైతం ఆన్‌లైన్ బెట్టింగ్, గంజాయి మత్తులో తూగుతూ ఈ వ్యాపకానికి బానిసలవుతున్నారు. ఇక తల్లిదండ్రులు వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడం సమస్యగా మారింది. పై కేసుల్లో పోలీసులకు పట్టుబడిన వారిలో 21 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. జిల్లాలో ఎక్కడెక్కడ వ్యభిచార గృహాలు ఉన్నాయో పోలీసులు గుర్తించి అడ్డుకట్ట వేయాల్సి ఉందని.. లేదంటే యువత భవిష్యత్తుకే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశా, ఒంగోలు,
బెంగళూరు యువతులే
పెట్టుబడిగా వ్యభిచారం
● కాలనీల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని వ్యవహారం
● ముఠాకు సహకరిస్తున్న వ్యక్తులెవరు..?
● కాలనీవాసుల సమాచారంతో పోలీసుల దాడులు.. కేసుల నమోదు
గద్వాల క్రైం: ఒడిశా, ఒంగోలు, బెంగళూరు రాష్ట్రాల్లోని యువతులే పెట్టుబడిగా కొందరు వ్యక్తులు నడిగడ్డలో గలీజు దందాకు తెరలేపారు. ఎవరికీ అనుమానం రాకుండా జిల్లా కేంద్రంలో కాలనీల మధ్యలోనే ఇళ్లు అద్దెకు తీసుకోవడం.. రాత్రి అయ్యిందంటే చాలు వ్యభిచారం నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే, అర్ధరాత్రి వేళల్లో యువతీ యువకులు వాహనాల్లో వచ్చి వెళ్తుండడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వగా పోలీసులు దాడి చేసి వారి కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలల్లోనే ఇలాంటి కేసులు జిల్లా కేంద్రంలోనే నాలుగు చోటు చేసుకోవడం గమనార్హం. ఒక చోట పట్టుబడిన వెంటనే మరో చోట దందాకు తెరలేపడం వెనుక ముఠా సూత్రధారులు ఎవరు, ఇతర రాష్ట్రాల నుంచి యువతులను చేరవేస్తున్న క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టడి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సహించేది లేదు
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యభిచార దందా నిర్వహిస్తున్న వారిని ఎంతమాత్రం సహించేది లేదు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాం. ఈ వ్యవహారంలో తెరవెనుక ఉన్న వ్యక్తులు ఎవరనేది విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇళ్లను అద్దెకు ఇచ్చిన వ్యక్తులను సైతం విచారిస్తాం. చెడు వ్యసనాలకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండాలి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment