ప్రజల తరఫున పోరాటం చేస్తాం
రాజోళి: ప్రజలకు ఇబ్బందులు కలిగితే వారి వెంట ఉండి వారి సమస్య పరిష్కారం అయ్యేవరకు నిరంతరం పోరాటం చేస్తామని ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఏడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నా.. యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మించేందుకు పావులు కదులుతుందని, ప్రజలను ఇబ్బందులు పెట్టి ఫ్యాక్టరీలు నిర్మించడం సరికాదన్నారు. గతంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కలెక్టర్, ఉన్నతాధికారులు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్యాక్టరీ నిర్మించడం వల్ల దాని వల్ల వెలువడే విషవాయువులు, రసాయనాలు పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో కలిస్తే నీరంతా విషమవుతుందన్నారు. నడిగడ్డ ప్రజలతో పాటు, కర్నూల్ జిల్లా వాసులకు కూడా తాగునీరందిస్తుంది ఆ నదేనన్నారు. పొలాలపై ఫ్యాక్టరీ ప్రభావం పడి బతుకుదెరువు ఆగమవుతుందని, భవిష్యత్తులో పిల్లలకు, ప్రజలకు పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణంపై పునరాలోచించి, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీ రద్దు నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా, పెద్దధన్వాడలో కూడా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనువాసులు, మాజీ వైస్ ఎంపీపీ చంద్రగౌడ్, మాజీ సింగిల్ విండో డెరెక్టర్ సంకపురం రాముడు, మహిపాల్ రెడ్డి,గోపాల్,బీఆర్‌ఎస్ నాయకులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment