అన్ని దారులూ...అన్నవరానికే!
● ఆదివారం జనసంద్రంగా రత్నగిరి
● సత్యదేవుని దర్శించిన
90 వేల మంది భక్తులు
● 8,900 వ్రతాల నిర్వహణ
● కార్తికమాసంలో 1,11,566కి
చేరిన వ్రతాలు
● ఆదాయం రూ.90 లక్షలు
● నేడు ఆఖరి సోమవారం కావడంతో
లక్ష మంది భక్తుల అంచనాతో ఏర్పాట్లు
అన్నవరం : కార్తిక మాస ఆదివారం రత్నగిరి సత్యదేవుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. సత్యదేవుని ఆలయం, వ్రత మంటపాలు, ఆలయ ప్రాంగణం, ఎక్కడ చూసినా భక్తజనమే దర్శనమిచ్చారు. సత్యదేవుని వ్రతాలు 8,900 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.90 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారన్న అంచనాతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్రతాలు, దర్శనం సాఫీగా జరిగాయి. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ వ్రత మంటపాల కార్యాలయంలో ఉండి వ్రతాల నిర్వహణ తదితర ఏర్పాట్లు పర్యవేక్షించగా, ఈఓ రామచంద్రమోహన్ పశ్చిమ రాజగోపురం వద్ద కంపార్ట్‌మెంట్‌ల వద్ద ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
భక్తుల వాహనాలతో
నిండిపోయిన పార్కింగ్ స్థలాలు
కార్తికమాసం, ఆదివారం కావడంతో వేలాది వాహనాలలో భక్తులు విచ్చేయడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్దలాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ఆ స్థలాలు సరిపోక సత్యగిరిపై ఘాట్‌రోడ్‌కు రెండువైపులా వాహనాలను నిలిపివేశారు. సుమారు పదివేల వాహనాలలో భక్తులు ఆలయానికి వచ్చుంటారని అంచనా వేస్తున్నారు.
పులిహోర కోసం పెద్ద క్యూ
సాధారణంగా సత్యదేవుని దర్శనానికి, వ్రతాల నిర్వహణ కోసం భక్తులు గంటల తరబడి క్యూ లో నిలబడతారు. కాని, ఆదివారం రామాలయం ఎదురుగా గల సర్క్యులర్ మండపంలో పంపిణీ చేస్తున్న పులిహోర, దద్దోజనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సోమవారం తెల్లవారుజాము ఒంటి గంట నుంచి వ్రతాలు, దర్శనాలు
కార్తికమాసంలో చివరి సోమవారం కావడంతో నేడు రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రానికే సుమారు 20 వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకున్నారు. స్వామివారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున ఒంటిగంటకు తెరచి వ్రతాలు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. రత్నగిరిపై వివిధ సత్రాలలో గదులు భక్తులతో నిండిపోయాయి.
ఇప్పటి వరకు 1,11.566 వ్రతాల నిర్వహణ
ఈ కార్తిక మాసంలో సత్యదేవుని ఇప్పటి వరకు 1,11,566 వ్రతాలు జరిగాయి. సోమవారం మరో పదివేల వ్రతాలు జరిగే అవకాశం ఉంది. కార్తికంలో మిగిలిన ఆరు రోజుల్లో మరో 30 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment