పంచారామ క్షేత్రంలో ఎన్నికల సంఘ సీఈఓ పూజలు
సామర్లకోట: రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆంజనేయులు ఆదివారం పంచారామ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయనకు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కాలభైరవస్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, మూల విరాట్, ఉప ఆలయాలతో పాటు కుమార రామభీమేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు చెరుకూరి రాంబాబు, శ్రీకాకుళపు వినయ్, సన్నిధి రాజు అంజి బాబు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ధార్మిక గ్రంథాల కంటే
రాజ్యాంగం గొప్పది
బోట్‌క్లబ్ (కాకినాడ): అన్ని మతాలు వారు చదివే ధార్మిక గ్రంథాల కంటే రాజ్యాంగం ఎంతో గొప్పదని మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎండి హలీమ్ అన్నారు. స్థానిక రాగంపేటలో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం – హక్కులు – పరిరక్షణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఎంతో విలువైనదన్నారు. అన్ని మతాల వారు శాంతియుత జీవితం గడిపే విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించారన్నారు. భారత రాజ్యాంగం అమలులో ఉన్న కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ఇమామ్ మెహిద్దీన్ పాల్గొన్నారు.
అప్పనపల్లి... భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాలబాలాజీ స్వామి కొలువైన అప్పనపల్లి క్షేత్రం ఆదివారం కోలాహలంగా మారింది. కార్తిక మాసం ఆదివారం కావడంతో స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు పాత, కొత్త ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. స్వామివారి సన్నిధిలో నిత్య శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.4.14 లక్షలు ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణ రాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.55,307 విరాళాలుగా వచ్చాయి. 6,578 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 4,259 మంది అన్న ప్రసాదం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment