సృజనకు పదును
● భావి శాస్త్రవేత్తలకు చక్కటి అవకాశం
స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్
● క్షేత్రస్థాయిలో అవగాహన
కల్పిస్తున్న విద్యాశాఖ
● సద్వినియోగం చేసుకోవాలంటున్న
అధికారులు
● నవంబర్ 30లోపు దరఖాస్తు
చేసుకోవాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అది ప్రయోగమైతే ప్రపంచాన్నే శాసిస్తుంది. ఇలాంటి ప్రయోగాలకు విజ్ఞాన శాస్త్రం నెలవు. ప్రయోగాలు చేసేవారు ఆకాశం నుంచి దిగిరావాలా? అవసరం లేదు. మనలోనే పుడుతున్నారు. మన బడిలో చదివినవారే నేడు ప్రపంచాన్ని ప్రయోగాలతో ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి వారి సృజనకు జీవం పోసి, పరిశోధనకు ఊతం ఇవ్వడానికి పుట్టుకొచ్చిందే స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్. ఇది భావిశాస్త్రవేత్తలకు చక్కటి అవకాశం.. అందిపుచ్చుకోవడానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.
ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యార్థులు చిన్న వయసులో ప్రాజెక్టుల రూపకల్పన చేసేలా కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ ’స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్’ అనే కార్యక్రమం చేపట్టింది. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇదో చక్కటి అవకాశం. 2024–25 సంవత్సరానికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నీతి ఆయోగ్, ఏటీఏఎల్ ఇన్నోవేషన్ మిషన్, యూనిసెఫ్, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇన్నోవేషన్ విభాగం, ఏఐసీటీఈ సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిపై ఇప్పటికే జిల్లాల సైన్స్ అధికారులకు, ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు, సైన్సు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంపై విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
అవకాశం ఎవరికంటే..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న వారందరికీ అవకాశం ఉంటుంది. కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 1,853 వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలున్నాయి. జిల్లాలో 146 వరకు జూనియర్ కళాశాలలున్నాయి. జిల్లాలో 6 నుంచి పదో తరగతి వరకు 1.58 లక్షల మంది, ఇంటర్మీడియెట్‌లో 46 వేలకు పైగా విద్యార్థులున్నారు. ఒక్కో పాఠశాల నుంచి బృందంగా విద్యార్థులు ప్రాజెక్టులకు రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఒక బృందంలో ఉండాలి. స్కూల్‌ఇన్నోవేషన్‌మారథాన్.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయునికి ఎంట్రీ కోర్సు నిర్వహిస్తారు. తర్వాత వారి ఆలోచనలు అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే ప్రాజెక్టుల రూపకల్పన ఏ విధంగా ఉండాలంటే.. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలి. ఇప్పటికే పరిష్కారం కనుగొని ఉంటే.. ఇంకా మెరుగైన పరిష్కారాలు సూచించాలి. ఎంపికై న విద్యార్థులకు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక బహుమతులు, ఉన్నత విద్యకు సహకారం అందిస్తారు.
జనవరిలో విజేతల ప్రకటన
జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 30 వ తేదీ నాటికి ప్రాజెక్టుల రూపకల్పన చేసి, దరఖాస్తు ల ప్రక్రియ పూర్తి చేయాలి. వాటిని పరిశీలించి 2025 జనవరిలో వేయిమంది విజేతలను ప్రకటిస్తారు. వచ్చే ఏడాది మే నెలలో విజేతలకు బహుమతులు అందిస్తారు. జులై 29న దేశవ్యాప్తంగా నిర్వహించే అతిపెద్ద ’ఇన్నోవేషన్ షో’లో విద్యార్థులు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో ప్రతి రాష్ట్రం నుంచి 20 బృందాలను విజేతలుగా ప్రకటిస్తారు. ఇంకా 20 బృందాలు ప్రభుత్వ పాఠశాలల నుంచి, 20 బృందాలు ఉమ్మడి జిల్లా నుంచి, ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి 20 బృందాలను ఎంపిక చేయనున్నారు.
మంచి కార్యక్రమం
స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. భావిశాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదిగేందుకు ఇదొక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు టీచర్లు సలహాలు, సూచనలు ఇవ్వాలి.
– పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ
సైన్సు టీచర్లు చొరవ చూపాలి
జిల్లాలోని సైన్సు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి, మారథాన్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో కళాశాలల సైన్సు టీచర్లకు తెలియజేశాం. జిల్లా నుంచి మంచి నాణ్యమైన ప్రాజెక్టులను తయారు చేసేలా టీచర్లు విద్యార్థులను ప్రోత్సహించాలి. విద్యార్థుల ఉజ్వల భవి ష్యత్తుకు ఇదొక మంచి కార్యక్రమం.
– జీజీకే నూకరాజు, ఇంటర్మీడియెట్
జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment