దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ప్రభుత్వం గడువును పొడిగించింది. అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 6వ తేదీతో గడువు ముగిసింది. పట్టభద్రులు ఓటు హక్కుకోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేసుకున్ని దరఖాస్తులను అధికారులు పరిశీలించి, అర్హత గల ఓటర్ల ముసాయిదా జాబితాను తయారు చేసి విడుదల చేశారు. అయితే అర్హత ఉండి అనేక కారణాల వల్ల ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వీరికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించి డిసెంబరు 9వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అర్హత గల పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చి నమోదు చేయించుకున్న వారికి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరి చేయించుకోవడంతో పాటు కొత్తగా ఓటు నమోదు చేయించుకోవచ్చు. కాగా.. ఈ ఎన్నికలకు సంబంధించి కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల్లో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో గోపాలపురం నియోజకవర్గంలో 10, కొవ్వూరులో 15, నిడదవోలులో 12 ఉన్నాయి. గోపాలపురం నియోజకవర్గంలో 5,845 మంది, నిడదవోలులో 7,520 మంది, కొవ్వూరులో 8,709 మంది ఓటు హక్కు పొందినట్టు రెవెన్యూ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్కొన్నారు. ప్రస్తుతం గడువు పొడిగించినందున ఓటర్లు పెరుగుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ 9 వరకూ పొడిగింపు
మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment