దోషరహితంగా ఓటరు జాబితా
కాకినాడ సిటీ: ఓటరు జాబితాను దోషరహితంగా రూపొందించడంలో అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మైన్స్ అండ్ జువాలజీ శాఖ కమిషనర్, డైరెక్టర్, కాకినాడ జిల్లా ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్ సగిలితో కలిసి ఎస్‌ఎస్‌ఆర్–2025 ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. పకడ్బందీగా ఓటర్ల జాబితా స్క్రూట్నీ చేయాలన్నారు. ఓటు నమోదు, సవరణకు అర్హులైనవారు ఫారం–6, 7, 8 దరఖాస్తులను అందజేయాలన్నారు. కలెక్టర్ షణ్మోహన్ జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ ప్రవీణ్ కుమార్‌కు వివరించారు. అక్టోబర్ 29 నాటికి 16,35,030 మంది ఓటర్లు నమోదయ్యారని, 8,04,886 మంది పురుషులు, 8,30,052 మంది మహిళలు, 190 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 1,640 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 9, 10, 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డిసెంబర్ 24 నాటికి క్లెయిమ్‌లను అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు. తుది జాబితాను 2025 జనవరి 6న ప్రచురిస్తామన్నారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, డీఆర్వో జె. వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె శ్రీరమణి, వివిధ నియోజకవర్గాల ఈఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment