మబ్బులతో రైతులకు గుబులు
కరప: అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని హెచ్చరికలు చేస్తుండటంతో ఖరీఫ్ పంట ఏమవుతుందోనని రైతుల్లో గుబులు రేపుతోంది. ఆకాశంలో మబ్బులు పట్టి మంగళ, బుధవారాల్లో ఈదురు గాలులు వీస్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ప్రతికూల పరిస్ధితులు ఎదురైనా, వాటన్నింటినీ తట్టుకుని, పెట్టుబడులు పెరిగినా భరించామని, పంట కోతకు రావడంతో పంటను దక్కించుకుందామంటే తుపాను వచ్చిపడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ సమయంలో వర్షాలు పడితే చేతికొచ్చిన పంట నీటిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ముదరగా ఊడ్చిన పొలాలు కోతకు రావడంతో మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీపావళి అమావాస్యకు చినుకులు పడకపోవడంతో ఆనందపడి, కోతలు చేపట్టిన రైతులకు అల్పపీడనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వారంరోజులుగా మబ్బులు లేకుండా వాతావరణం అనుకూలంగా ఉండటంతో కోతలు చేపట్టామని రైతులు అంటున్నారు. లేతగా ఊడ్చిన పొలాల్లో పంట పక్వ దశకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, చివరిలో అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస తుపాన్లు, వర్షాలతో పంట దెబ్బతిందని రైతులు అంటున్నారు. దిగుబడులు అంతంతమాత్రంగా ఉన్నాయని ఆందోళన చెందుతుంటే గోరుచుట్టుపై రోకటిపోటు చందాన అల్పపీడనం మరింత దెబ్బతీస్తోందని రైతులు అంటున్నారు. ఈదురు గాలులకు కంకుల నుంచి ధాన్యం రాలిపోతుందని, కోసిన చేలు పనమీద, నేలనంటి ఉన్న వరిచేలు వర్షాలుపడితే పనిచేయకుండా పోతాయని రైతులు వాపోతున్నారు.
పెరిగిన కూలి రేట్లు
ఆకాశంలో మబ్బులుపట్టి, వాతావరణం మారడంతో కూలీ రేట్లు కూడా పెరిగిపోయాయని, మగవారికి రూ.900 ఉండే కూలీ రూ.1,200, మహిళలకు రూ.400 నుంచి రూ.600కు పెంచేశారని, అయినా మనుషులు దొరకడంలేదని రైతులు తెలిపారు. కోసిన చేలను హడావుడిగా కుప్పలు వేసుకునే, నూర్పిళ్ల పనిలో రైతులు నిమగ్నమయ్యారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని లేఅవుట్లలోకి తీసుకొచ్చి, రాశులు చేసి, తడిసిపోకుండా బరకాలతో కప్పి ఉంచుకుంటున్నారు. ఈ ఏడాది పెట్టుబడులు రాకపోయినా పశుగ్రాసమైనా దక్కుతుందనుకుంటే, తుపాను కారణంగా వర్షాలు పడితే అదీకూడా కుళ్లిపోతుందని కరపకు చెందిన రైతులు వెలుగుబంట్ల రవినాయుడు, బండే వీరబాబు తెలిపారు.
ఆందోళన చెందుతున అన్నదాతలు
దిగుబడి తగ్గుతుందని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment