రేషన్ బియ్యం విదేశాలకు పోకుండా నిఘా
కాకినాడ సిటీ: కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం యాంకరేజి పోర్టులో స్టేలా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన రెవెన్యూ, మైరెన, పోలీస్, టెక్నికల్ అధికారులు, పోర్టు సిబ్బందితో కలిసి తీరంలోని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి సముద్రంలో లంగరు వేసిన ఈ షిప్పు వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. నౌకలో అప్పటికే లోడ్ చేసిన బియ్యం నమూనాలను సేకరించి, సిబ్బందిని లోడ్ చేస్తున్న బియ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన యాంకరేజ్ పోర్టుకు చేరుకుని తనిఖీ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంలో రెవెన్యూ, మైరెన్ పోలీస్, టెక్నికల్ అధికారులు, పోర్టు సిబ్బంది కలిసి సముద్రంలో బియ్యం లోడింగ్ జరుగుతున్న స్టేలా ఎల్ షిప్పును ఆకస్మికంగా తనిఖీ చేసి నమూనాలను సేకరించామన్నారు. నౌకలోని 5 హేచస్స్‌లో 52 వేల టన్నుల లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు అప్పటికే లోడింగ్ జరిగిందన్నారు. దీనిలో బాయిల్డ్ రైస్‌తో పాటు 640 టన్నుల బియ్యం కూడా గతంలో ప్రభుత్వం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని రిలీజ్ చేసిన స్టాక్‌గా గుర్తించినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తనిఖీలో కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, పోర్టు సీఐ పి.సునీల్‌కుమార్, ఏపీ ఎస్పీఎఫ్ అధికారి ఓ శ్రీధర్, పోర్టు కన్జర్వేటర్ వీరబాబు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ షణ్మోహన్ సగిలి
Comments
Please login to add a commentAdd a comment