నేటి నుంచి నృత్య, నాటకోత్సవాలు
బోట్‌క్లబ్: సరస్వతీ గానసభ 121వ వార్షిక సంగీత, నృత్య నాటకోత్సవాలు గురువారం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ జరుగుతాయని ప్రముఖ గాయనీ పెద్దాడ సూర్యకుమారి బుధవారం విలేకర్లకు తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం 6.30 గంటలకు చైన్నెకు చెందిన కృష్ణమోహన్, శ్రీరామ్‌కుమార్‌మోహన్ గాత్ర కచేరీ జరుగుతుందన్నారు. ఈ 29న సాయంత్రం 6.30 గంటలకు చోడే అనిల్‌కుమార్ సౌజన్యంతో విజయనగరం విజయ సూర్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్యాశుల్కం నాటకం ప్రదర్శిస్తారన్నారు. ఈ నాటకంలో అందరూ మహిళా పాత్రధారులే ఉంటారన్నారు. ఈ నెల 30న సాయంత్రం చైన్నెకు చెందిన ఓఎస్ అరుణ్ గాత్ర కచేరీ, డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6. 30 గంటలకు విశాఖపట్నంకు చెందిన కుమారి ఆర్.లక్ష్మీకృష్ణప్రియ గాత్ర కచేరీ ఉంటాయన్నారు.
బాల్య వివాహాలను
నిరోధించాలి
కొత్తపల్లి: మండలంలో బాల్య వివాహాల నిరోధక కమిటీలు సమర్థంగా పని చేయాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కిశోర్ వికాసం, బాల్య వివాహల నిరోధక చట్టంపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి శిక్షణ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి కొవ్వాత్తుల ర్యాలీ చేశారు. ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది, కమిటీలు 18 సంవత్సరాల బాల బాలికలు చదువుకునేలా చూడాలన్నారు. జిల్లా హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు పోక్స్ చట్టంపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ చిన్నారావు, సీడీపీఓ దుర్గాదేవి, వైద్య, పంచాయతీ, రెవెన్యూ, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ ఉత్తీర్ణత
పెంచేందుకు కార్యాచరణ
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు బోర్డు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న స్టడీ అవర్ల సమయాన్ని పెంచడం, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం వంటి చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులు ఏ విషయంలోనైనా అసౌకర్యానికి గురైతే వారి తల్లిదండ్రులు ఆ సమస్యను నేరుగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లకు తెలియజేయవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment