రేషన్ షాపులకు సకాలంలో స్టాకు
కరప: ఎంఎల్‌ఎస్ కేంద్రం నుంచి రేషన్‌షాపులకు సరకులను సకాలంలో పంపించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎంవీఎస్ ప్రసాద్ సూచించారు. మండలంలోని వేళంగిలోని ఎంఎల్‌ఎస్ (మండల లెవెల్ స్టాక్) కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి టెక్నికల్ అసిస్టెంట్ సౌందర్యను స్టాక్ వివరాలు అడిగి తెలుసుకుని, సూచనలిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేళంగి ఎంఎల్‌ఎస్ కేంద్రం నుంచి కరప, కాజులూరు, పెదపూడి మండలాల రేషన్ షాపులకు బియ్యం, పంచదార, కందిపప్పు పంపిస్తామన్నారు. డిసెంబర్ నెల కోటా సరకులు పంపిస్తున్నామన్నారు. కరప మండలంలో 46 రేషన్ షాపులుండగా ఆరింటికి, కాజులూరు మండలంలో ఆరు షాపులకు స్టాక్ పంపించాల్సి ఉందన్నారు. పెదపూడి మండలానికి పూర్తిగా స్టాక్ పంపించామన్నారు. కొరిపల్లిలోని సివిల్ సప్‌లైస్ గోదాంలలోని స్టాక్ నాణ్యత పరిశీలన జరుగుతుండటంతో స్టాక్ రావడం ఆలస్యమైందని, రెండురోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని మండలాలకు స్టాకు సరఫరా చేస్తామన్నారు. తర్వాత పెనుగుదురు రైతుసేవా కేంద్రంలో ధాన్యం సేకరణ ఎలా జరుగుతున్నదీ పరిశీలించారు. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, తుపాన్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment