ఎంఎస్‌ఎంఈలపై సర్వే
● వాటి పనితీరు మెరుగుదలకు ‘ర్యాంప్’
● కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: ఎంఎస్‌ఎంఈల పని తీరును మెరుగుకు, వాటిని అభివృద్ధి వేగవంతం చేసేందుకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ కార్యక్రమం అమలు చేస్తోందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇందులో భాగంగా తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లోని అన్ని ఎంఎస్‌ఎంఈలపై సర్వే చేసి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చి, ఏపీ ఎంఎస్‌ఎంఈ వన్ పోర్టల్‌కు అనుసంధానిస్తారని వివరించారు. తద్వారా రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల డేటాబేస్ అభివృద్ధి చేస్తారన్నారు. ఈ సర్వే కోసం ఎంఎస్‌ఎంఈ సర్వే అండ్ సపోర్టు అనే మొబైల్ యాప్ రూపొందించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సచివాలయాల సిబ్బంది శుక్రవారం ఆదివారం వరకూ ఈ సర్వే చేస్తారన్నారు. సర్వే పురోగతిని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ద్వారా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందేందుకు ఎంఎస్‌ఎంఈలు అర్హత పొందుతాయన్నారు. బ్యాంకు రుణాలు సులభతరమవుతాయని చెప్పారు. జిల్లాలోని ఎంఎస్‌ఎంఈలు, ఎంఎస్‌ఎంఈ సంఘాలు, ఇతర పరిశ్రమలు, వర్తక, వాణిజ్య సంఘాలు సర్వేకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
సాయుధ దళాల నిధికి విరాళాలివ్వాలి
అనునిత్యం దేశ భద్రతకు కృషి చేస్తున్న సాయుధ దళాల సంక్షేమ నిధికి ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ షణ్మోహన్ విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. మాజీ సైనికులు, యుద్ధ వితంతవుల సంక్షేమం కోసం విరాళాలు అందించే వారు జిల్లా సైనిక్ సంక్షేమ కార్యాలయం పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా పరిషత్ శాఖ, కాకినాడ బ్రాంచిలో 620640623 అకౌంట్ నంబర్‌కు (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0020974) నేరుగా జమ చేయవచ్చని వివరించారు. విరాళాలు అందజేసే వారికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందన్నారు.
ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత
ఈవీఎం, వీవీ ప్యాట్‌లకు పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును ఆయన గురువారం పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు తీసుకున్న చర్యలను తనిఖీ చేసి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ గోదామును ప్రతి నెలా తనిఖీ చేసి, కేంద్ర ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదిక పంపిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment