మా భూముల్లో ఎయిర్‌పోర్టు వద్దు
● మరోచోటుకు తరలించండి
● తహసీల్దార్‌కు రైతుల వినతి
తొండంగి: తమ భూముల్లో ఎయిర్‌పోర్టు నిర్మించే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ బెండపూడి, పీఈ చిన్నాయపాలెం, అన్నవరం గ్రామాల రైతులు స్థానిక తహసీల్దార్ మురార్జీకి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు వద్దని కోరుతూ బాధిత రైతులు కొద్ది రోజుల క్రితం అమరావతిలో కాకినాడ ఎంపీని, పలువురు మంత్రులను కలిసి, వినతిపత్రాలు సమర్పించారు. దీంతో పాటు ప్రజాదర్బారులో కూడా వినతులు అందజేశారు. ఈ మేరకు అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల రైతులతో తహసీల్దార్ మురార్జీ మాట్లాడారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన భూముల్లో ప్రస్తుతం 1,200 మందికి పైగా రైతులు రెండు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ భూములు తీసేసుకుంటే తమతో పాటు పరోక్షంగా వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టును మరోచోటుకు తరలించాలని కోరారు. ఎయిర్‌పోర్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను రైతులందరూ తహసీల్దార్‌కు మరోసారి అందజేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలూ అందలేదని వారికి తహసీల్దార్ వివరించారు. రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment