రత్నగిరికి భక్తుల తాకిడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 3,845 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. స్వామి సన్నిధికి గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలు, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు తరలివచ్చిన వాహనాలతో పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. సత్యదేవుని వ్రతాలు 3,845 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు.
1,36,600 వ్రతాల నిర్వహణ
కార్తిక మాసంలో ఇంకా మూడు రోజులు మిగిలి ఉండగా గురువారం నాటికి సత్యదేవుని వ్రతాలు 1,36,600 జరిగాయి. శుక్రవారం 4 వేలు, శని, ఆదివారాల్లో సుమారు 10 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ 2022 కార్తిక మాసంలో జరిగిన 1,42,378 వ్రతాలే రికార్డు కాగా, ఈ ఏడాది కార్తికం దీనిని అధిగమిస్తుందని భావిస్తున్నారు.
నేడు సహస్ర జ్యోతిర్లింగార్చన
కార్తిక బహుళ చతుర్దశిని పురస్కరించుకుని రత్నగిరిపై అనివేటి మండపంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేసిన అనంతరం, శివలింగాకారంలో ఏర్పాటు చేసిన జ్యోతులను వెలిగిస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment