ఆశాజనకంగా రబీ
గోకవరం: ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది ఖరీఫ్‌లో నష్టాలు చవిచూసిన రైతులు రబీ సాగు వైపు ఆశాజనకంగా అడుగులు వేశారు. కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతమైన జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా కాలువలు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వాతావరణం అనుకూలించినప్పటికీ వరుస తుపానుల ప్రభావంతో పంట దిగుబడి తగ్గింది. ఏలేరు కాలువ ప్రమాదభరితంగా పొంగిపొర్లడంతో జగ్గంపేట, పిఠాపురంలో ఎక్కువగా రైతులు పంట నష్టపోయారు. ఈ నష్టాల నుంచి బయట పడేందుకు రైతులు రబీ సాగు వైపు దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా జగ్గంపేట నియోజకవర్గంలో 15 వేలు, ప్రత్తిపాడులో 22 వేలు, తునిలో 13 వేల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేపట్టారు. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పంపా గేట్లు, పుష్కర అక్విడెక్టుకు మరమ్మతులు చేస్తుండటంతో సాగుకు నీరు లేక వీటి కింద రబీ సాగు నిలిచిపోయింది. గోకవరం మండలంలో ముసురుమిల్లి, సూరంపాలెం, కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువపై, తొండంగిలో పిఠాపురం కెనాల్ బ్రాంచిపై ఆధార పడగా మిగిలిన మండలాల్లో రైతులు చెరువులు, బోర్లపై ఆధారపడి రబీ సాగు చేపట్టారు. రైతులు వరితో పాటు మొక్కజొన్న, అపరాలు, కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 71 హెక్టార్లలో వరి, 25 వేల హెక్టార్లలో అపరాలు సాగు చేస్తుండగా మెట్టలో 20 వేల హెక్టార్లలో వరి సాగు జరుగుతోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రబీ సాగులో ప్రస్తుతం వరి నాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే కాలువల కింద సాగు చేస్తున్న రైతులు నాట్లు పూర్తి చేశారు. గోకవరం, జగ్గంపేట, కిర్లంపూడి, తొండంగి, ఏలేశ్వరం, తుని, రౌతులపూడి, గండేపల్లి, ప్రత్తిపాడు మండలాల్లో వరి నాట్లు పూర్తికాగా మిగిలిన ప్రాంతాల్లో పంట పొలాల్లో దమ్ములు చేపట్టడంతో పాటు ఇతర వ్యవసాయ పనులు నిర్వహిస్తున్నారు.
మెట్టలో 20 వేల హెక్టార్లలో సాగు
జోరుగా వరి నాట్లు వేస్తున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment