కూటమి హామీలు అమలు చేయాలి
కాకినాడ సిటీ: కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, యువతకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ భృతి కల్పించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం కాకినాడ జిల్లా నూతన కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. సోమవారం కాకినాడ సుందరయ్యభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21, 22 తేదీల్లో పెద్దాపురంలో జరిగిన సీపీఎం 24వ జిల్లా మహాసభలలో 11 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నికై ందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. పెన్షన్‌లు తొలగించడానికి సర్వేలు ప్రారంభించారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ జిల్లా అభివృద్ధి కోసం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. సీనియర్ నేత దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఈజెడ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు రాలేదు కాబట్టి చట్ట ప్రకారం వాటిని రైతులకు తిరిగి ఇవ్వాలన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ బెండపూడిలో విమానాశ్రయ నిర్మాణాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సెజ్ భూముల్లోగాని, గురజనాపల్లి స్టాల్ భూముల్లో గాని ఏర్పాటు చేయాలన్నారు. కాకినాడ పోర్టు రాజకీయ ప్రయోజనాలకు కాకుండా ఉపాధి కల్పనకు కేంద్రంగా మారాలని కోరుతున్నామన్నారు. జిల్లా కమిటీ సభ్యులు జి.బేబీరాణి, కేఎస్ శ్రీనివాస్, పలివెల వీరబాబు, సీహెచ్ రాజ్‌కమార్, టేకుమూడి ఈశ్వరరావు, సీహెచ్ రమణి, నీలపాల సూరిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment