ఇదేం మద్యవర్తిత్వం?
● మద్యం అమ్మకాలపై ఖాకీ సెస్
● దుకాణదారులతో బేరసారాలు
● వ్యాపారుల ఆఫర్ షాపునకు :రూ.10వేలు
● ఆ సీఐ డిమాండ్ చేస్తున్నది :రూ.50 వేలు
● డీఎస్పీ సూచించినది : రూ.35వేలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతల పాలనలో సొమ్ములివ్వాలే కాని ఎటువంటి పని అయినా క్షణాల్లో అయిపోతుంది. ఇందుకు ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ గద్దెనెక్కిన దగ్గర నుంచి దాదాపు అన్ని విభాగాల్లోనూ పైసలదే పై చేయిగా ఉంది. ఇందుకు పోలీసు వ్యవస్థ కూడా మినహాయింపు కానే కాదు. కాసులు కురిపించే పోస్టింగ్‌ల కోసం కొందరు లక్షలాది రూపాయలు ముడుపులు మూటగట్టి కూటమి నేతల చేతుల్లో పెట్టి వచ్చారు. కాకినాడ జిల్లాలో పలు పోలీసు సర్కిల్స్‌లో పోస్టింగ్ కోసం పోలీసులు కనిష్టంగా రూ.30 లక్షలు, గరిష్టంగా రూ.70 లక్షలు కొందరు ప్రజాప్రతినిధులకు ఇచ్చి వచ్చారు. సీట్లోకి వచ్చి అప్పుడే ఐదారు నెలలైపోయింది. సహజంగా వచ్చే మామూళ్లు ఎంత చేతికొచ్చినా కూటమి నేతలు జేబులో పెట్టినంత సొమ్ము తిరిగి రావడం లేదు. సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా మద్యం వ్యాపారం రూపంలో వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదని అనుకున్నారు. రూ.లక్షలు ముడుపులు ముట్టచెప్పి వచ్చిన త్రీ స్టార్ (సీఐ) సహా పోలీసు అధికారులు సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, గుండాట. జూదం పేరు చెప్పి భారీగానే లాగేశారు. ఇంకా మిగిలిపోయింది రాబట్టేందుకు లిక్కర్ సిండికేట్‌పై పడ్డారు.
కాకినాడ సిటీలో 36 మద్యం దుకాణాలు, 8 బార్‌లు, కాకినాడ రూరల్‌లో 12 మద్యం దుకాణాలు, మూడు బార్లు నడస్తున్నాయి. జిల్లా అంతటా కలిపి సుమారు 150 దుకాణాలు నడుస్తున్నాయి. నెలన్నర క్రితం మద్యం దుకాణదారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు పక్షాల మధ్య దఫ దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చి ఎట్టకేలకు ప్రజాప్రతినిధుల డిమాండ్‌లకు వ్యాపారులు తలొగ్గక తప్ప లేదు. కూటమి నేతలు అడిగినంతా ఇచ్చుకునేందుకు వ్యాపారులు సానుకూలంగా స్పందించడంతో సమస్యకు తెరపడింది. ఈ సమస్య పరిష్కారం అయ్యిందనుకుంటోన్న తరుణంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక మద్యం షాపునకు రూ.10వేలు వంతున ఇవ్వడానికి అభ్యంతరం లేదని వ్యాపారుల తరఫున కాకినాడలో ఉన్న అనధికార సిండికేట్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఇలా అయితే నెల నెలా రూ.4.80 లక్షలు ఇస్తామని, ఇంతకు మించి ఇవ్వలేమని వ్యాపార ప్రతినిధులు తేల్చి చెప్పారని విశ్వసనీయ సమాచారం. అలా కుదరదంటూ కాకినాడ రూరల్‌కు చెందిన ఒక త్రీస్టార్ ఒక్కో షాపునకు రూ.50వేలు (పోలీస్ టాక్స్) తక్కువ గాకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తిరిగి రాబట్టుకోవాలని ఆత్రం
కాకినాడ రూరల్ కూటమిలో ఒక ముఖ్య నేతకు రూ.అరకోటి ముట్టజెప్పి కుర్చీ దక్కించుకున్న సంబంధిత త్రీస్టార్ ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. కాకినాడ సిటీ, రూరల్‌లలో మిగిలిన స్టార్స్‌ను ఏకంచేశారనే అంశం పోలీసు వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాసులు కురిపించే పోస్టింగ్‌ల కోసం వెనుకాముందు ఆలోచించకుండా నేతలకు ఇచ్చుకున్న రూ.లక్షలు తిరిగి రాబట్టుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన మార్గంగా భావిస్తున్నారు. అందుకే అందివచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టడంలేదనే చర్చ పోలీసువర్గాల్లో చక్కర్లు కొడుతోంది. లిక్కర్ వ్యాపారం చేయాలంటే ‘త్రీ స్టార్’ పెట్టిన రేటు ఇవ్వాలా అని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అంత ఇచ్చి సీటులోకి వచ్చి ఇప్పుడు పది, పరక అని బేరమాడితే ఎలా అని అందరి తరఫున మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఆ త్రీస్టార్ ఒకింత అసహనం వ్యక్తం చేశారంటున్నారు. ఈ పోలీసు లంచాయితీ అటు తిరిగి ఇటు తిరిగి 10 రోజుల క్రితం సీఐ నుంచి డివిజన్ స్థాయి అధికారి వద్దకు చేరింది. బేరసారాలు అనంతరం ఒకో షాపు నుంచి రూ.35 వేలు ఇవ్వాలని నాటి పంచాయితీలో తేల్చారు. ఇందుకు లిక్కర్ సిండికేట్ ప్రతినిధులు అంగీకరించక పోవడంతో పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. కాగా, కాకినాడ సిటీ, రూరల్‌లో త్రీ స్టార్ పంచాయితీకి తలొగ్గి రేట్లు ఖాయం చేయొద్దని జిల్లాలోని మిగిలిన ప్రాంతాల మద్యం వ్యాపార ప్రతినిధులు కాకినాడ సిటీ, రూరల్ వ్యాపారులకు హితబోధ చేశారని సమాచారం. పొరబాటున కాకినాడలో వారు చెప్పినట్టు ఆమోదిస్తే జిల్లా అంతటా అమలు చేయాల్సి వస్తే తలకుమించిన భారమైపోతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య చర్చలలో కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ఎప్పుడు తెరపడుతుందో అని ఇరు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment